అహ్మదాబాద్, జూన్ 14: అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగి 270కి చేరింది. ఎవరూ ఊహించని ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీరని శోకం నెలకొంది. విమానంలోని ప్రయాణికులే కాకుండా బీజే మెడికల్ హాస్టల్ విద్యార్థులు నలుగురు, దాని సమీపంలోని కొందరు స్థానికులు ఈ ప్రమాదంలో మృత్యువాత పడటం అందరినీ కలిచి వేస్తున్నది. ఒక్కొక్కరి మరణ గాథ హృదయాలను మెలి పెడుతున్నది.
మధ్యాహ్నం భోజన వేళ హాస్టల్‌కు వచ్చిన ఎంతో ఉజ్వల భవిష్యత్తు కలిగిన నలుగురు మెడికోలు, రెసిడెంట్ డాక్టర్ల కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల తమ పనుల్లో నిమగ్నమైన అన్నెం పున్నెం ఎరుగని స్థానిక వ్యాపారులు, రోగులు అనుకోకుండా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టిస్తున్నది. విమానం కూలి కింద పడే క్రమంలో గాయపడి చికిత్స పొందుతున్న కొందరు శుక్ర, శనివారాల్లో మృతి చెందారని అధికారులు తెలిపారు. మరోవైపు విమానం తోక భాగంలో ఎయిర్ హోస్టెస్ మృతదేహాన్ని శనివారం గుర్తించారు. విమానంలోని ప్రయాణికులతో పాటు సుమారు 33 మంది స్థానికులు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఇప్పటివరకు అహ్మదాబాద్‌లోని సివిల్ దవాఖానకు 270 మృతదేహాలు వచ్చినట్టు అధికారులు తెలిపారు.ఇప్పటివరకు తొమ్మిది మృతదేహాల డీఎన్ఏలు సరిపోలాయని, దీంతో వారి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించామన్నారు. అలాగే 8 మృతదేహాల ముఖాలు చెక్కుచెదరకుండా ఉండటంతో వాటిని ఇప్పటికే బంధువులకు ఇచ్చేశామన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనేక మంది వైద్యులు మరణించినట్టు జరుగుతున్న ప్రచారాన్ని జూనియర్ డాక్టర్ల అసోసియేషన్, బీజే మెడికల్ కాలేజీ (బీజేఎంసీ) శనివారం ఖండించాయి. భోజనం చేస్తున్న నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు మాత్రమే మరణించారని, 20 మంది విద్యార్ధులు గాయపడ్డారని, అందులో 11 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపాయి. అలాగే అతుల్యం భవనంలో నివసిస్తున్న సూపర్ స్పెషాలిటీ వైద్యుల కుటుంబ సభ్యులు నలుగురు కూడా ఈ ప్రమాదంలో మరణించారన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అత్యున్నతస్థాయి కమిటీని నియమించినట్టు కేంద్రం శనివారం తెలిపింది. బ్లాక్‌బాక్స్‌ను డీకోడ్ చేస్తే విమానం కూలడానికి ముందు ఏం జరిగిందనేది తెలుస్తుందని పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు. కఠిన భద్రతా ప్రమాణాలు, ప్రొటోకాల్‌ను అనుసరించినప్పటికీ ప్రమాదం జరిగిందని ఆవేదన చెందారు. హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతస్థాయి క్రమశిక్షణ ప్యానెల్ సోమవారం సమావేశమవుతుందని పేర్కొన్నారు. అలాగే, బోయింగ్ 787 విమానాలను తరచూ తనిఖీ చేయాలని ఆదేశించినట్టు చెప్పారు.
గుజరాత్‌లోని ఆనంద్ పట్టణానికి చెందిన సురేష్ మిస్త్రీ పరిస్థితి మరింత హృదయ విదారకం. 21 సంవత్సరాల తన కుమార్తె క్రీనా మిస్త్రీని విమాన ప్రమాదంలో ఆయన పోగొట్టుకున్నారు. ప్రభుత్వ దవాఖాన మార్చురీ వద్ద తన కుమార్తె మృతదేహం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. ఏడాది క్రితం కీనాకు లండన్ నుంచి వర్క్ పర్మిట్ వీసా వచ్చింది. ఇటీవలే ఆనంద్‌కు తిరిగి వచ్చిన క్రీనా చిన్న ప్రమాదం బారిన పడింది. డెంటల్ సర్జరీ చేసుకున్న తర్వాత లండన్‌కు డ్రీమ్‌లైనర్ విమానం ఎక్కి ప్రాణాలు కోల్పోయింది.
అహ్మదాబాద్: భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బ్రిటన్‌లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదువుకునేందుకు ఎయిర్ ఇండియా విమానం ఎక్కిన ఆ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. సరకులు రవాణా చేసే ఆటో ట్రాలీ డ్రైవర్‌గా జీవితాన్ని గడుపుతున్న ఆ యువతి తండ్రి విదేశాలలో పై చదువులు పూర్తి చేసిన తర్వాత తమ కుమార్తె తమకు ఆర్థికంగా అండగా నిలబడుతుందని గంపెడాశతో అప్పులు చేసి మరీ కుమార్తెను విమానం ఎక్కించాడు.
గుజరాత్‌లోని హిమత్‌నగర్‌కు చెందిన పాయల్ ఖతీక్ గురువారం ఉదయం మొట్టమొదటిసారి దేశం విడిచి వెళుతున్నానన్న ఉద్వేగంతో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కింది. అయితే కొన్ని క్షణాల్లోనే కూలిపోయిందన్న దుర్వార్తను టీవీలలో చూసి ఆమె కుటుంబం గుండె పగిలింది. మాస్టర్స్ డిగ్రీ లండన్‌లో చదువుకోవాలని తన కూతురు కోరుకోవడంతో ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అప్పు చేసి మరీ ఆమెను లండన్ పంపించాలని నిర్ణయించుకున్నామని పాయల్ తండ్రి సురేష్ ఖతీక్ ఐఏఎన్ఎస్ వార్తాసంస్థకు తెలిపారు. తమ కుటుంబంలో విదేశాలలో చదువుకోవడానికి అవకాశం వచ్చిన తొలి వ్యక్తి పాయల్ అని ఆయన తెలిపారు.
వారంతా రాబోయే కాలంలో కాబోయే డాక్టర్లు. ప్రజలకు సేవ చేసే వృత్తిలో భాగస్వాములు కాబోతున్నామన్న ఆ యువ వైద్యుల ఆశలు, ఆశయాలను ఛిద్రం చేస్తూ మృత్యువు హఠాత్తుగా విమాన రూపంలో కబళించింది. ఆనందంతో కబుర్లు చెప్పుకుంటూ బీజే మెడికల్ హాస్టల్లో గురువారం మధ్యాహ్న భోజనం చేస్తున్న వారిలో కొందరు అదే తమ ఆఖరి భోజనం అని తెలుసుకోలేక పోయారు. ఆకాశం నుంచి మృత్యువులా దూసుకొచ్చిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం వారి భవనం పైకి దూసుకురావడంతో నలుగురు మెడికోలు, మరో నలుగురు వైద్యుల కుటుంబ సభ్యులు ఏం జరిగిందో తెలిసుకునే లోగానే వారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.