Air India Flight Crash | అహ్మదాబాద్‌లో 270 మంది ఎయిర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వారం రోజులవుతున్నది. ఇప్పటి వరకు డీఎన్ఏ మ్యాచింగ్ ద్వారా 211 మంది మృతదేహాలను గుర్తించి.. 189 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. విమాన శిథిలాలు సంఘటనా స్థలంలోనే పడి ఉన్నాయి. దర్యాప్తు అధికారులు సంఘటనను పరిశీలిస్తున్నారు. ప్రమాదాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు అప్పగించిన 189 మృతదేహాల్లో 142 మంది భారతీయులవి కాగా.. 32 మంది బ్రిటిష్, ఏడుగురు పోర్చుగీస్, ఒక కెనడియన్ పౌరుడదని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి తెలిపారు. 189 మృతదేహాల్లో విమానం కూలిన సంఘటనా స్థలంలో ఏడుగురి మృతదేహాలు ఉన్నాయని పేర్కొన్నారు. జూన్ 12న మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI-171 అహ్మదాబాద్‌లోని ఒక వైద్య కళాశాల క్యాంపస్‌లో కూలిపోయింది. ప్రమాదంలో విమానంలో ఉన్న ఒక వ్యక్తి తప్ప మిగిలిన ప్రయాణికులందరూ మరణించారు.
అదే సమయంలో విమానం కూలిన చోట ఉన్న దాదాపు 29 మంది సైతం ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన ఏడు రోజుల తర్వాత సైతం.. విమానం శిథిలాలు, తోక రెక్కతో సహా శిథిలాలన్నీ సంఘటనా స్థలంలోనే పడి ఉన్నాయి. దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పౌర విమానయాన మంత్రిత్వశాఖలోని ఓ విభాగం, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు జరుపుతున్నది. భారీ విమాన ప్రమాదాలు జరిగిన సమయంలో ఏఏఐబీ బృందం పరిశీలించే విషయం తెలిసిందే. అయితే, గుజరాత్ ప్రభుత్వం గురువారం దర్యాప్తులో తమ పాత్ర లేదని స్పష్టం చేసింది. ప్రమాద స్థలంలో జరుగుతున్న దర్యాప్తులో ఫోరెన్సిక్ బృందం నిపుణులక సహాయం అందిస్తుందని అహ్మదాబాద్ అదనపు చీఫ్ ఫైర్ ఆఫీసర్ జయేష్ ఖాడియా తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఎయిర్ ఇండియా సిబ్బంది లైమ్నుథెమ్ సింగ్సన్ మృతదేహాన్ని గురువారం దిమాపూర్ విమానాశ్రయంలో ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. సింగ్సన్ మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాకు చెందిన మహిళ. ఆమె మృతదేహాన్ని ఇండిగో విమానంలో అహ్మదాబాద్ నుంచి నాగాలాండ్ విమానాశ్రయానికి తీసుకువచ్చారు.