Ahmad Ahanger | కశ్మీర్‌కు చెందిన ఎజాజ్ అహ్మద్ అహంగర్ అలియాస్ అబూ ఉస్మాన్ అల్-కశ్మీరీని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. అల్‌ఖైదాతో సంబంధాలు కలిగి ఉన్న ఇండివీడివల్ టెర్రరిస్ట్‌గా గుర్తిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అహంగర్‌ను భారత చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 ప్రకారం ఉగ్రవాదిగా ప్రకటించిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ విషయం ప్రకటించింది.
ఎజాజ్ అహ్మద్ అహంగర్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో నివసిస్తున్నాడు. ఇస్లామిక్ స్టేట్ జమ్ముకశ్మీర్ (ఐఎస్‌జేకే) కోసం కీలకమైన రిక్రూటర్లలో ఒకరుగా ఉన్నాడు. 1996లో కశ్మీర్‌లోని జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు. ఆన్లైన్ ఇండియా-సెంట్రిక్ ఐసిసి ప్రచార పత్రికను ప్రారంభించడంలో కీలకపాత్ర పోషించాడు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అతడిని నాలుగో షెడ్యూల్లో చేర్చడం ద్వారా అహంగర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన 49 వ వ్యక్తిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్లో పేర్కొన్నది.
కాబూల్‌లోని గురుద్వారాపై 2020 మార్చి 25 న జరిగిన దాడిలో ఆఫ్ఘాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చేపట్టిన దర్యాప్తులో ఎజాజ్ అహ్మద్ అహంగర్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇస్లామిక్ స్టేట్ ఫర్ ఖురాసన్ ప్రావిన్స్ అధిపతి, ఆయన అనుచరులతో కలిసి ఈ దాడికి బాధ్యులుగా అధికారులు పరిగణించారు. ఈ దాడిలో దాదాపు 25 మంది సిక్కులు మరణించారు. 1974 లో శ్రీనగర్‌లో జన్మించిన ఎజాజ్ అహ్మద్ అహంగర్.. ఇప్పటివరకు అనేక ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నాడు. వివిధ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలను సమన్వయ పర్చడం ద్వారా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు చేపట్టినట్లు తెలుస్తున్నది.