బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పాలక బీజేపీని ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పదును పెడుతోంది. బీజేపీ అసమర్ధ పాలన, అవినీతి పాలనను ఎండగడుతూ సోమవారం నగరంలో నిరసన ప్రదర్శనలకు కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) సన్నద్ధమైంది.
సుపరిపాలన, బెంగళూర్‌కు మౌలిక వసతులు కల్పించాలనే డిమాండ్‌తో పార్టీ చేపట్టనున్న పోరాట కార్యక్రమాల్లో రణ్‌దీప్ సుర్జీవాలా, డీకే శివకుమార్, సిద్ధరామయ్య వంటి దిగ్గజ నేతలు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. బెంగళూర్‌లో దాదాపు 300కిపైగా ప్రాంతాల్లో సోమవారం పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాయని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.
బీజేపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అవినీతి పెరిగిపోయిందని, బెంగళూర్‌లో అభివృద్ధి కనిపించడం లేదని, రహదారులు అధ్వానంగా తయారయ్యాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ పాలనలో విచ్చలవిడిగా అవినీతి చోటుచేసుకోవడంతో ప్రధానంగా ఈ అంశంపైనే ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనుకూల వాతావరణం ఏర్పరచుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. రాహుల్ జోడో యాత్ర ముగిసిన అనంతరం హాథ్ సే హాథ్ జోడో యాత్రనూ దిగ్విజయం చేసేలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది.