(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : లక్షలాది వీడియోల్లో మనమెక్కడ ఉన్నామో కనిపెట్టడం కృత్రిమ మేధ (ఏఐ)కి చిటికెలో పని. కానీ, ఆ వీడియోలో మనం ఆనందంగా ఉన్నామా? విచారంగా ఉన్నామా?అసలు ఎందుకు అలా ఉన్నామో కనిపెట్టేది ఒక్కరే. అది తోటిమనిషి. అయితే, ఇది ఇప్పటివరకూ. భవిష్యత్తులో ఈ పనిని కూడా మెషీన్లే చేయబోతున్నాయి. ‘నీ మనసు ఏమిటో నాకు తెలుసు’ అంటూ ఈ మర మనుషులు మరో మనిషిగా మారబోతున్నాయి. దీనికి కారణం ఏఐ పరిశోధనల్లో కీలక ముందడుగే. అదే ఏజీఐ (ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్).
మనిషిలా ఆలోచించి, పరిస్థితులకు తగ్గట్టు మసలుకొనే కృత్రిమ మేధ రకమే ‘ఏజీఐ’. కృత్రిమ మేధలో దీన్ని అడ్వాన్స్డ్ వెర్షన్‌గా చెప్పొచ్చు. ఇది అర్థం చేసుకోగలదు. చదవగలదు. మనుషుల్లాగే తన ఆలోచనలు, తెలివితేటలను రకరకాల పనులకు వాడుకోగలదు. నేర్చుకోవడంతో పాటు గత అనుభవాలను బట్టి తనను తాను మెరుగుపరుచుకొంటుంది. స్నేహితుడిలా సలహాలు, గైడ్‌గా సూచనలు ఇస్తుంది. భావోద్వేగాలను బట్టి సంభాషణలు సాగిస్తుంది. ఒకవిధంగా మనిషి కాని మనిషిగా దీన్ని చెప్పొచ్చు.
ఏఐ తనకు అందుబాటులోని డాటా ఆధారంగా ఏ ప్రశ్న అడిగామో.. దానికి సరైనదనుకొన్న సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది. మనుషుల ఫొటోలు, గొంతును ఏఐ గుర్తుపడుతున్నప్పటికీ, మాటల్లోని వ్యంగ్యాన్ని, ఉద్వేగాల్ని, ముఖంలోని భావోద్వేగాల్ని పసిగట్టలేకపోతున్నది. అయితే, ఏజీఐ పూర్తిగా మనిషిలా ఆలోచిస్తుంది. మన అవసరాలను, అలవాట్లను అవగాహన చేసుకొంటుంది. మానవ అభిజ్ఞ నైపుణ్యాలు, తర్కాన్ని జోడించి.. ఏది మంచో ఏది కాదో గుర్తించి సలహాలు, సూచనలు ఇస్తుంది. అంటే రోబో సినిమాలో భావోద్వేగాలు లేని చిట్టి ‘ఏఐ’ అయితే, భావోద్వేగాలు వచ్చిన తర్వాత చిట్టిని ‘ఏజీఐ’గా చెప్పొచ్చు.
ఓపెన్ ఏఐకు చెందిన జీపీటీ-4 మాడల్, గూగుల్ డీప్‌మైండ్, డీప్‌సీక్, గ్రోక్ తదితర టూల్స్ ఏఐ సాంకేతికతలో ముందున్నాయి. ఇప్పుడు వీటిని తలదన్నేలా ఏజీఐని అతి త్వరలో తీసుకురావాలని మెటా అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏఐ రంగంలో 50 మంది టాప్ సైంటిస్టులతో ఇటీవల తన నివాసంలో సమావేశమైన జుకర్‌బర్గ్ ఈ ఏజీఐ ప్రాజెక్టును వారికి అప్పగించినట్టు బ్లూమ్‌బర్గ్ ఓ కథనంలో వెల్లడించింది. ఇందుకోసం వారికి భారీ యెత్తున ప్యాకేజీ ఇచ్చినట్టు సమాచారం. కాగా, మనిషిని తలదన్నే రీతిలో మేధస్సును అందిపుచ్చుకొనే ఏజీఐని సరైన విధంగా నియంత్రించకపోతే తీవ్ర పరిణామాలు, ముప్పు వాటిల్లవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.