బెంగళూరు: కొందరు విదేశీయులు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి ప్రత్యేకంగా రైడ్లు నిర్వహించారు. 25 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు (Foreigners Detained). కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చర్చి స్ట్రీట్ వంటి పెద్ద వీధుల్లో కొందరు విదేశీయులు అనైతిక పనులు చేస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో శనివారం రాత్రి వేళ సడెన్గా తనిఖీలు చేపట్టారు. ఒక డీసీపీ, ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లు, 6 మంది ఇన్స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 20 మంది మహిళా సిబ్బంది, 20 మంది పురుష సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఆఫ్రికా జాతీయులైన 25 మంది స్త్రీ, పురుషులతోపాటు ఒక స్థానిక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, డ్రగ్స్ సేవించడం, వ్యభిచారం కోసం విటులను ఆకట్టుకోవడం వంటి చర్యలకు వారు పాల్పడుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నార్కోటిక్ చట్టంతోపాటు పబ్లిక్ న్యూసెన్స్, ప్రజా సేవకుల విధులను అడ్డుకోవడం వంటి పలు సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అదుపులోకి తీసుకున్న విదేశీయుల్లో ఇద్దరి వీసా గడువు ముగిసినట్లు వెల్లడించారు.