తిరువనంతపురం: తన జీవితంలో ఇకపై ఇండిగో విమానంలో ప్రయాణించబోనన్న సీపీఎం నేత తన శపథాన్ని వీడారు. గురువారం కన్నుమూసిన కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు ఇండిగో విమానంలో ఢిల్లీకి ప్రయాణించారు. ఏచూరీని కడసారి చూడటం కన్నా తన శపథం అంత పెద్దది కాదని ఆయన అన్నారు. 2022 జూన్ 13న కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు, ఆ రాష్ట్రానికి చెందిన సీపీఎం నేత, ఎల్డీఎఫ్ మాజీ కన్వీనర్ ఈపీ జయరాజన్ కన్నూర్ నుంచి ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఆ విమానం తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే అందులో ఉన్న ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం విజయన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జయరాజన్ ఆ నిరసనకారులను పక్కకు నెట్టారు.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై రెండు వారాలు, సీపీఎం నేత జయరాజన్‌పై మూడు వారాలపాటు ప్రయాణ నిషేధాన్ని ఇండిగో విధించింది. ఈ నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. తాను లేదా తన కుటుంబ సభ్యులు దేశీయ లేదా అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఇకపై ఇండిగో విమానాల్లో ప్రయాణించబోమని జయరాజన్ శపథం చేశారు. తన జీవితంలో ఇంకెప్పుడూ ఇండిగో ఫ్లైట్ ఎక్కడం కంటే తన గమ్యస్థానానికి నడవడమే మేలని చెప్పారు. ఇండిగో కంటే మంచి సేవలు అందించే ఎయిర్‌లైన్ సంస్థలు దేశంలో చాలా ఉన్నాయని అన్నారు.
మరోవైపు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఇండిగో విమానాలను బహిష్కరించిన ఈపీ జయరాజన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. గురువారం రాత్రి కరిపూర్ విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎక్కిన ఆయన అందులో ప్రయాణించి ఢిల్లీకి చేరుకున్నారు. ఇండిగో విమానంలో ప్రయాణించబోనని తాను తీసుకున్న నిర్ణయం సీతారాం ఏచూరి కంటే పెద్దదికాదని ఆయన అన్నారు.