ముంబై: ఒక న్యాయవాది ఇంట్లో 15 రోజులుగా వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆ న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. (series of thefts in Advocate Home) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. న్యాయవాది ధృతిమాన్ జోషి కుటుంబం 1938 నుంచి దాదర్ ఈస్ట్ ప్రాంతంలోని సొంత ఇంటిలో నివసిస్తున్నది. ఆగస్టు 15 నుంచి ఆ ఇంటిలోని గ్యాస్ సిలిండర్లు, పాత్రలు, డోర్ లాచ్లతో సహా పలు వస్తువులను దొంగలు చోరీ చేసినట్లు న్యాయవాది జోషి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇల్లు శిథిలావస్థకు చేరడంతో సమీపంలోని బిల్డింగ్‌లోకి మారినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ఇంట్లో వదిలేసిన వస్తువులు 15 రోజుల నుంచి వరుసగా చోరీ అవుతున్నాయని ఆరోపించారు.
కాగా, పాత ఇంట్లో దొంగతనాల గురించి ఫిర్యాదు చేసిన తనను పోలీసులు ఎగతాళి చేశారని న్యాయవాది జోషి విమర్శించారు. పాడుబడి వదిలేసిన ఇళ్లలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమని వారు చెప్పారని అన్నారు. కేసు నమోదు చేసినప్పటికీ పోలీసులు సరిగా దర్యాప్తు చేపట్టలేదని ఆరోపిస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పొరుగు ఇళ్లలో కూడా ఇలాంటి చోరీలు జరుగుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు.
మరోవైపు న్యాయమూర్తులు రేవతి మోహితే-దేరే, పృథ్వీరాజ్ చవాన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీస్ ఇన్స్పెక్టర్ కోర్టుకు హాజరయ్యారు. ఆ ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.
కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించామని, కొందరు అనుమానాస్పద వ్యక్తులు కనిపించారని ముంబై పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీఎన్ సాగరే కోర్టుకు తెలిపారు. పోలీసులు మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. దీంతో దర్యాప్తు పురోగతిపై తాజా సమాచారాన్ని ఇవ్వాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 25కు వాయిదా వేసింది.