కోల్‌కతా: పరీక్షల్లో మార్కులు తక్కువ రావడంతో ఒక బాలిక కిడ్నాప్ డ్రామా ఆడింది (girl fakes kidnapping ). చెల్లితో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లింది. తమను కిడ్నాప్ చేసినట్లు తండ్రికి మెసేజ్ పంపింది. అంతేగాక విడిపించేందుకు కోటి నగదు డిమాండ్ చేసింది. ఆ బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు చివరకు ఇద్దరి ఆచూకీని గుర్తించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. బాన్స్డ్రోని ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక పదో తరగతి పరీక్ష రాసింది. శుక్రవారం ఫలితాలు రావడంతో ఆరేళ్ల చెల్లితో కలిసి స్కూటీపై నెట్ సెంటర్‌కు వెళ్లింది. ఫలితాలు చూసుకోగా ఆ బాలికకు 31 శాతం మార్కులు వచ్చాయి.
కాగా, తన మార్కుల పట్ల తల్లిదండ్రులు తిడతారని భావించిన ఆ బాలిక కిడ్నాప్ డ్రామా ఆడింది. చెల్లితో కలిసి మరో ప్రాంతానికి వెళ్లింది. తమ ఇద్దరిని కిడ్నాప్ చేసినట్లు తండ్రికి ఎస్ఎంఎస్ పంపింది. అలాగే విడిపించేందుకు వెంటనే కోటి నగదు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆ డబ్బును తీసుకుని నేపాల్‌గంజ్ ప్రాంతానికి రావాలని ఆ మెసేజ్‌లో పేర్కొంది.
మరోవైపు కుమార్తెలు ఎంత సేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడం, మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అలాగే వారిని కిడ్నాప్ చేసినట్లు ఎస్ఎంఎస్ రావడంతో మరింత కంగారుపడ్డారు. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఒక మెట్రోస్టేషన్ వద్ద ఆ బాలిక స్కూటీని గుర్తించారు. దీంతో ఆమె తన చెల్లితో కలిసి మెట్రో రైలులో ప్రయాణించి అనంతరం కృష్ణానగర్ వెళ్లే లోకల్ ట్రైన్ ఎక్కి ఉంటుందని అనుమానించారు. ఈ నేపథ్యంలో ఆ జిల్లా పోలీసులు, రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. ఇద్దరు బాలికల ఫొటోలు వారికి పంపారు.
చివరకు నాడియా జిల్లాలోని డివైన్ నర్సింగ్ హోమ్ ముందు ఉన్న ఆ బాలికలను కృష్ణానగర్ జిల్లా పోలీసులు గుర్తించారు. వారిని కోల్‌కతాకు తీసుకొచ్చి ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో తల్లిదండ్రులకు భయపడి ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు ఆమె చెప్పింది. దీంతో పోలీసులు ఆ బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమెతోపాటు చెల్లిని వారి కుటుంబానికి అప్పగించారు.