న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు హెచ్చరికతో ఆర్మీ దిగి వచ్చింది. కోర్టును ఆశ్రయించిన 11 మంది మహిళలకు పర్మినెంట్ కమిషన్ మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు సర్వోన్నత కోర్టుకు ఆర్మీ శుక్రవారం హామీ ఇచ్చింది. అన్ని అర్హత ప్రమాణాలు ఉన్నప్పటికీ శాశ్వత కమీషన్ కోసం చేసిన దరఖాస్తులను ఆర్మీ తిరస్కరించిందని ఆరోపిస్తూ 11 మంది షార్ట్ సర్వీస్ కమిషన్డ్ మహిళా అధికారిణులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, గత కేసులో కోర్టు ఇచ్చిన తీర్పును పాటించని ఆర్మీ అధికారులను కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లుగా పరిగణించాల్సి వస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన 11 మంది షార్ట్ సర్వీస్ కమిషన్డ్ మహిళా అధికారిణులకు శాశ్వత కమిషన్ను మంజూరు చేసేందుకు ఆర్మీ అంగీకరించింది. ఆ మహిళా అధికారుల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు తెలిపింది. దీంతో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు ప్రక్రియను ఈ నెల 26లోగా పూర్తి చేయాలని ఆర్మీని సుప్రీంకోర్టు ఆదేశించింది.