న్యూఢిల్లీ: ఆయుష్మాన్ భారత్ అతిపెద్ద స్కామ్ అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు. ఇది నకిలీ స్కామ్ అని సుప్రీంకోర్టు ధృవీకరించడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వం మారి దర్యాప్తు చేపడితే ఆయుష్మాన్ భారత్ పథకంలో జరిగిన భారీ అవినీతి గురించి ప్రజలకు తెలుస్తుందని అన్నారు.
కాగా, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని అమలు చేయడంలేదు. ఈ నేపథ్యంలో పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం-అభీమ్)ను ఢిల్లీలో అమలు చేయడానికి జనవరి 5 లోగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకం చేయాలని డిసెంబర్ 24న ఆప్ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
మరోవైపు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఆయుష్మాన్ భారత్ అమలు కోసం ఒప్పందం చేసుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. కేంద్రం, ఇతరుల స్పందన కోరుతూ నోటీసులు జారీ చేసింది.