NIFT Results |న్యూఢిల్లీ, జూన్ 9 : తమ స్కోర్బోర్డులు, అటెండెన్స్ రికార్డుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) 2026 పరీక్షకు హాజరైన పలువురు విద్యార్థులు ఆరోపణలు చేయడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కొత్త ప్రశ్నలు ఎదుర్కొంటున్నది. తమ ఫలితాల్లో కనిపించిన మార్కులు తమ అంచనాలకు విరుద్ధంగా ఉన్నాయని పలువురు విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కొందరు విద్యార్థులు తమ అటెండెన్స్ రికార్డులు, పరీక్ష కేంద్రాల వద్ద బయోమెట్రిక్ తనిఖీ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 3న నిఫ్ట్ 2026 ఫలితాలు వెలువడ్డాయి. దీని ప్రవేశ ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో అభ్యర్థులు జనరల్ ఎబిలిటీ టెస్ట్(జీఏటీ), క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్(సీఏటీ)కి హాజరు అవుతారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు సిచుయేషన్ టెస్ట్‌కు హాజరవుతారు.
తమ సీఏటీ స్కోర్లలో వైరుధ్యాలు ఉన్నట్లు పలువురు విద్యార్థులు ఆరోపించారు. సీఏటీ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు ప్రశ్నలు ఉంటాయి. చాలా ఎక్కువ మార్కులు వస్తాయని ఆశించినప్పటికీ కేవలం 15 నుంచి 17 మార్కులు మాత్రమే వచ్చాయని కొందరు అభ్యర్థులు పేర్కొన్నారు. జనరల్ ఎబిలిటీ టెస్ట్లా కాకుండా క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్‌కు ఆన్సర్ కీ విడుదల చేయకపోవడం వల్ల అభ్యర్థులు తమ పనితీరును స్వయంగా అంచనా వేసుకోవడం కష్టంగా ఉందని అభ్యర్థులు పేర్కొన్నారు. జీఏటీపై కూడా అభ్యర్థుల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఎన్టీఏ విడుదల చేసిన అధికారిక ఆన్సర్ కీతో తమ సమాధానాలను సరిపోల్చి చూసుకున్న తర్వాత తమకు వచ్చిన స్కోరు తమ స్కోర్‌కార్డులలో పేర్కొన్న మార్కుల కంటే గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని కొందరు అభ్యర్థులు తెలిపారు. అటెండెన్స్ రికార్డుల్లో కూడా అక్రమాలు జరిగాయని కొందరు విద్యార్థులు ఆరోపించారు. పరీక్షకు హాజరైన కొందరు విద్యార్థులను మొదట గైర్హాజరుగా గుర్తించారని, మరికొందరు పరీక్ష రాయనప్పటికీ తమను హాజరుగా గుర్తించారని ఆరోపించారు. తమ పరీక్ష కేంద్రాల వద్ద బయోమెట్రిక్ వెరిఫికేషన్ నిర్వహించ లేదని కొందరు అభ్యర్థులు ఆరోపించారు.
ఈ ఆరోపణలపై ఎన్టీఏ వర్గాలు స్పందిస్తూ పరీక్షకు హాజరైన దాదాపు 12,000 మంది అభ్యర్థుల్లో కేవలం 15 మంది మాత్రమే ఫలితాలకు సంబంధించిన సమస్యలతో ఏజెన్సీని సంప్రదించారని తెలిపారు. తమకు నేరుగా అందిన అన్ని ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించినట్లు వారు చెప్పారు. అయితే పలువురు విద్యార్థులు మాత్రం తమ ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా ఎన్టీఏని పలుమార్లు సంప్రదించామని, తమ స్కోర్లపై సంతృప్తికరమైన వివరణ తమకు అందలేదని వారు చెప్పారు.