న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) బాటను జామియా మిలియా ఇస్లామియా (Jamia Millia Islamia) అనుసరించింది. టర్కీ విద్యా సంస్థలతో జరిగిన ఒప్పందాలను నిలిపివేసింది. జామియా మిలియా ఇస్లామియా పీఆర్వో, ప్రొఫెసర్ సైమా సయీద్ ఈ విషయాన్ని తెలిపారు. ‘టర్కీతో అనుబంధంగా ఉన్న విద్యా సంస్థలతో ఉన్న అన్ని అవగాహన ఒప్పందాలను మేం నిలిపివేశాం. దేశం, భారత ప్రభుత్వంతో జామియా నిలుస్తుంది’ అని అన్నారు.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైనిక చర్యలు చేపట్టింది. మే 7న పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. అనంతరం పాక్ కవ్వింపులను భారత్ తిప్పికొట్టింది.
మరోవైపు ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు టర్కీ బహిరంగంగా మద్దతు ఇచ్చింది. టర్కీ అందించిన డ్రోన్లు, ఇతర ఆయుధాలను పాక్ ప్రయోగించగా భారత్ అడ్డుకుని ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో టర్కీపై భారత్‌లో వ్యతిరేక వ్యక్తమైంది. ఆ దేశం వస్తువులను వ్యాపారులు బహిష్కరించారు. టర్కీకి టూర్ ప్యాకేజీలను ట్రావెల్ ఏజెన్సీలు నిలిపివేశాయి. అలాగే టర్కీతో జరిగిన ఒప్పందాలను పలు సంస్థలు నిలిపివేస్తున్నాయి.