లక్నో: కోట్లాది రూపాయల అవకతవకలపై దర్యాప్తు చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఒక పోస్టాఫీసుపై దాడి చేసింది. ఒక రోజు తర్వాత పోస్టల్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Postal Officer Kills Self) సహోద్యోగులను నిందిస్తూ సూసైడ్ నోట్ రాశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఈ సంఘటన జరిగింది. బులంద్‌షహర్ ప్రధాన పోస్టాఫీసుకు చెందిన రిటైర్డ్ ఫీల్డ్ ఆఫీసర్ సహా ఎనిమిది మందికి పైగా ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి సీబీఐ అవినీతి నిరోధక విభాగం రైడ్ చేసింది.
కాగా, పోస్టల్ సూపరింటెండెంట్ త్రిభువన్ ప్రతాప్ సింగ్ బుధవారం ఉదయం అలీగఢ్‌లోని తన ఇంట్లో లైసెన్స్డ్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీబీఐ రైడ్స్ వల్ల ఒత్తిడికి గురైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు దీనిని ఖండించారు. తమ ఆదేశాల ప్రకారం పని చేయాలంటూ ఒక మహిళ, కొందరు అధికారులు బలవంతం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఆఫీసు వాట్సాప్ గ్రూప్‌లో ఆయన పోస్ట్ చేసిన సూసైడ్ నోట్‌ను పోలీసులకు షేర్ చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.