Delhi blast : ఢిల్లీ (Delhi) లోని నేతాజీ సుభాష్ మార్గ్ (Netaji Subhash Marg) లోగల ఎర్రకోట (Red fort) కు సమీపంలో కారులో బాంబులు పేలిన ఘటన.. మృతుల కుటుంబాల్లో పెనువిషాదాన్ని మిగిల్చింది. అందులో ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని శ్రావస్తి (Shravasti) కి చెందిన భూరే మిశ్రా (Bhure Mishra) కుటుంబం కూడా ఒకటి. భూరే ముగ్గురు కొడుకులు ఢిల్లీలోనే ఉంటున్నారు. టీవీలో పేలుడు వార్త విన్న భూరే వెంటనే తన కొడుకులకు ఫోన్లు చేశాడు. కాళ్లకింద భూమి కదిలిపోయే వార్త విని కుప్పకూలాడు.
వివరాల్లోకి వెళ్తే.. భూరేష్ మిశ్రా సోమవారం రాత్రి 8 గంటల సమయంలో శ్రావస్తిలోని తన నివాసంలో టీవీలో వార్తలు వింటున్నాడు. సరిగ్గా అప్పుడే ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయని, 8 మంది అక్కడికక్కడే మరణించారని, మరో 30 మందికిగాపైగా తీవ్రంగా గాయపడ్డారనే వార్త విన్నాడు. దాంతో ఉలిక్కిపడ్డ భూరే వెంటనే తన కొడుకులు ముగ్గురికి ఫోన్లు చేశారు.
వారిలో ఇద్దరు కుమారులు ఫోన్ ఎత్తి మాట్లాడారు. కానీ మూడో కొడుకు దినేష్ మిశ్రా ఫోన్ మాత్రం స్విచ్చాఫ్ వచ్చింది. దాంతో లోలోపల కీడును శంకిస్తూనే తన కుమారుడికి ఏం కాదులే అని సర్దిచెప్పుకుని దినేష్ నుంచి ఫోన్ కోసం ఎదురుచూడసాగాడు. ఆ తర్వాత కొంతసేపటికే తన ఇద్దరు కొడుకుల్లో ఒకరు ఫోన్ చేసి దినేష్ మరణవార్త గురించి చెప్పారు. దాంతో అతడి కుప్పకూలిపోయాడు.
ఈ ఘటన గురించి భూరే మాట్లాడుతూ.. ‘నేను రాత్రి 8 గంటల ప్రాంతంలో టీవీలో వార్తలు చూస్తున్నా. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారులో పేలుళ్లు జరిగాయని వార్త విన్నా. నా ముగ్గురు కొడుకులు ఢిల్లీలోనే ఉంటుండటంతో వెంటనే అందిరికీ ఫోన్లు చేశారు. ఇద్దరు కొడుకులు ఫోన్లు లిఫ్ట్ చేసి మాట్లాడారు. కానీ దినేష్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. లోలోపల భయం ఉన్నా, నా కొడుకు ఏం కాదనే ఆశతో వేచిఉన్నా. కానీ నా మరో కొడుకు ఫోన్ చేసి దినేష్ మరణవార్త చెప్పాడు’ అని విలపించారు.
కాగా దినేష్‌కు భార్య రీనా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రీనా తన ఇద్దరు కుమార్తెలతో శ్రావస్తిలోనే ఉంటుండగా.. దినేశ్ తన 8 ఏళ్ల కొడుకు, సోదరులతో కలిసి ఢిల్లీలో ఉంటున్నాడు. ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కారులో పేలుడులో ప్రాణాలు కోల్పోయాడు.