జైపూర్: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే 48 గంటల డెడ్‌లైన్‌తో గ్రామస్తులు, అధికారులు దిగివచ్చారు. పశువుల దొడ్డిలో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలను మరో చోటకు మార్చారు. రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Abhijeet Dipke) ‘పాఠశాలలు బాగుచేసుకుందాం’ అనే ప్రచారంలో భాగంగా సీజేపీ కో కన్వీనర్ అశుతోష్ రాంకా, మరికొందరు సభ్యులు ఒక గ్రామానికి వెళ్లగా స్థానికులు వారిని అడ్డుకుని తరిమికొట్టారు. ఈ సందర్భంగా ఘర్షణ చెలరేగింది.
కాగా, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దీనిపై తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ స్కూల్ భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థుల చదువులు పశువుల పాకలో కొనసాగడంపై ఆయన మండిపడ్డారు. 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే జైపూర్‌లో తాను ధర్నాకు దిగుతానని, శుక్రవారం పరిస్థితి తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు విద్యాశాఖను సంప్రదించారు. ఆ పాఠశాలను సురక్షితమైన ప్రదేశానికి మార్చాలని కోరారు. విద్యాశాఖ అనుమతితో స్థానిక నివాసి సమకూర్చిన ఇంటికి ఆ పాఠశాలను తాత్కాలికంగా తరలించారు.
మరోవైపు సురక్షిత ప్రదేశంలో 18 మంది పిల్లలకు తరగతులు ప్రారంభం కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. శాశ్వత పాఠశాల భవన నిర్మాణానికి కూడా తమ వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు తెలిపారు. దీనిని సీజేపీ ప్రభావంగా అశుతోష్ కొనియాడారు. శిథిలావస్థలో ఉన్న స్కూల్ భవనాన్ని అధికారులు కూల్చివేసినట్లు ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.