లక్నో: ఒక వ్యక్తిపై దాడి కేసులో 30 ఏళ్లుగా కోర్టులో విచారణ కొనసాగింది. సుమారు 15 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. చివరకు జీవించి ఉన్న నిందితులకు రూ.2,000 చొప్పున జరిమానాను కోర్టు విధించింది. ఈ తీర్పు గురించి తెలుసుకున్న బాధితుడు, గ్రామస్తులు షాక్ అయ్యారు. (UP assault case) ఉత్తరప్రదేశ్లోని బండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 1994లో మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు రామ్రూప్ శర్మను బంధించి కొట్టారు. అతడ్ని డబ్బులు డిమాండ్ చేశారు. తీవ్రంగా గాయపడిన రామ్రూప్ శర్మ తనపై దాడి చేసిన ముగ్గురు గ్రామస్తులపై కామసిన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా, స్థానిక కోర్టులో 30 ఏళ్లుగా దాడి కేసుపై విచారణ కొనసాగింది. సాక్షులు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఈ కేసు పెండింగ్లో ఉండిపోయింది. విచారణ కాలంలో 15 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. చివరకు ఇరు వర్గాల వాదనలు పూర్తి కావడంతో జూన్ 13న ఈ కేసుపై తీర్పును కోర్టు వెల్లడించింది. రామ్రూప్ శర్మపై దాడి చేసిన ముగ్గురు నిందితుల్లో ఒక వ్యక్తి మరణించాడు. దీంతో మిగతా ఇద్దరు నిందితులకు రూ.2,000 చొప్పున జరిమానా విధించింది.
మరోవైపు దాడి కేసులో బాధితుడైన రామ్రూప్ శర్మతోపాటు గ్రామస్తులు కోర్టు తీర్పు పట్ల ఆశ్చర్యపోయారు. 15 మంది న్యాయమూర్తులు 30 ఏళ్లుగా విచారణ జరిపి నిందితులకు కేవలం రూ.2,000 జరిమానాతో సరిపెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, దాడి సమయంలో 40 ఏళ్ల బాధితుడైన రామ్రూప్ శర్మ ఇప్పుడు 70 ఏళ్ల వృద్ధుడు. అలాగే నాడు ఆయనపై దాడి చేసిన 20 ఏళ్ల యువకులు ప్రస్తుతం 50 ఏళ్ల వయసుకు చేరారు.