ఐజ్వాల్: మూడు దశాబ్దాల నాటి సమస్య పరిష్కారం కానున్నది. మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో ఉన్న బెటాలియన్ ప్రధాన కార్యాలయాన్ని అస్సాం రైఫిల్స్ ఖాళీ చేయనున్నది. (Assam Rifles To Vacate) నగరానికి 15 కిలోమీటర్ల దూరానికి స్థావరాన్ని మార్చనున్నది. ఈ మేరకు ఒప్పందం జరిగింది. 1988లో అస్సాం రైఫిల్స్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో 12 మంది పౌరులు మరణించారు. దీంతో రాజధాని ఐజ్వాల్ నుంచి అస్సాం రైఫిల్స్ బలగాలను తరలించాలని నాటి సీఎం లాల్డెంగా నేతృత్వంలోని ప్రభుత్వం డిమాండ్ చేసింది.
కాగా, మూడు దశాబ్దాల తర్వాత ఈ సమస్య పరిష్కారమవుతున్నదని మిజోరాం సీఎం లాల్దుహోమా తెలిపారు. 2025 ఏప్రిల్‌లో ఐజ్వాల్ ప్రధాన కార్యాలయం నుంచి నగరానికి 15 కిమీ దూరంలోని జోఖావ్సాంగ్లోని స్థావరానికి అస్సాం రైఫిల్స్ బలగాలు వెళ్తాయని తెలిపారు. న్యూఢిల్లీలోని మిజోరాం హౌస్‌లో ఒప్పంద పత్రం (ఎంఓఏ)పై బుధవారం సంతకాలు జరిగినట్లు ఆయన చెప్పారు. మిజోరాం ప్రభుత్వ కమిషనర్, సెక్రటరీ వనలదినా ఫనాయ్, అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా ఈ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారని వెల్లడించారు.
మరోవైపు 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ ఒప్పందం అమలులోకి వస్తుందని మిజోరాం సీఎం లాల్దుహోమా తెలిపారు. జోఖావ్సాంగ్లో కొన్ని నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. 2025 ఏప్రిల్ నాటికి అస్సాం రైఫిల్స్‌కు తగ్గిన ధరను మిజోరాం ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. అలాగే అస్సాం రైఫిల్స్ అప్పగించిన స్థలాలను సంబంధిత చట్టం ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తామని వెల్లడించారు.