అగర్తలా : త్రిపురలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ (ASF) కలకలం సృష్టించింది. సెపాహిజాలా జిల్లా పరిధిలోని దేవిపూర్‌లో ఉన్న జంతు వనరుల అభివృద్ధి శాఖ (ARDD) నిర్వహిస్తున్న ఫారమ్‌లో కేసులను గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, విషయం తెలుసుకున్న అగర్తలలోని నిపుణుల బృందం సోమవారం ఫామ్‌కు చేరుకొని.. పరిస్థితిని అంచనా వేసేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఈ నెల 7న మూడు నమానాలను పరీక్షల కోసం ఈశాన్య ప్రాంతీయ వ్యాధి నిర్ధారణ లాబోరేటరీ (NERDDL)కి పంపారు.
13న పీసీఆర్ ఫలితాలు రాగా.. అన్ని శాంపిల్స్ పాజిటివ్‌గా ఉన్నట్లు నిర్ధారించారు. పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉండడంతో.. ఫ్లూ ఫారమ్ మొత్తం వ్యాపించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నడిచే డిసీజ్ టెస్టింగ్ లాబొరేటరీ సీనియర్ అధికారి మాట్లాడుతూ వీటికి సంబంధించి మరో నివేదిక భోపాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిసీజ్ డయాగ్నోస్టిక్స్ నుంచి రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఫ్లూను అరికట్టేందుకు పందులను వధించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తున్నది.