న్యూఢిల్లీ: విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టులు పాల్గొనకుండా నిషేధం విధించారంటూ విమర్శలు ఎదుర్కొన్న అఫ్ఘన్ మంత్రి అమిర్‌ఖాన్ ముత్తాఖీ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి హాజరు కావాల్సిందిగా మహిళా జర్నలిస్టులను మంత్రి ఆహ్వానించారు.
శుక్రవారం ఢిల్లీలోని అఫ్ఘనిస్థాన్ ఎంబసీలో ముత్తాఖీ మీడియా సమావేశం నిర్వహించగా, ఇందులో ఒక్క మహిళ కూడా కనిపించలేదు. మహిళా జర్నలిస్టులను పాల్గొనకుండా అడ్డుకున్నారనే వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ కొందరు మహిళా పాత్రికేయులు సోషల్‌మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తమ ప్రమేయం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.