జైపూర్: రాజస్థాన్ హైకోర్టు లివిన్ రిలేషన్షిప్(Live-in Relationship)పై సంచలన వ్యాఖ్యలు చేసింది. యుక్త వయసు వచ్చిన ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేయవచ్చు అని కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ ఆ ఇద్దరికీ పెళ్లి ఈడు రాకున్నా.. లివిన్ రిలేషన్లో కొనసాగవచ్చు అని కోర్టు వెల్లడించింది. పెళ్లి వయసు నెపంతో రాజ్యాంగ హక్కుల్ని కొట్టిపారేయలేమని కోర్టు పేర్కొన్నది. జస్టిస్ అనూప్ ధండ్ తన తీర్పులో ఈ వ్యాఖ్యలు చేశారు. 18 ఏళ్ల మహిళ, 19 ఏళ్ల అబ్బాయి.. తాజాగా రాజస్థాన్ హైకోర్టులో పిటీషన్ వేశారు. పరస్పర అంగీకారంతోనే ఇద్దరం రిలేషన్లో ఉన్నామని ఆ జంట కోర్టుకు చెప్పింది. 2025, అక్టోబర్ 27వ తేదీన సహజీవనం చేస్తామని ఓ ఒప్పందం కూడా కుదుర్చుకున్న విషయాన్ని ఆ జంట వెల్లడించింది.
అయితే అమ్మాయికి చెందిన కుటుంబుం ఆ లివిన్ రిలేషన్‌ను వ్యతిరేకిస్తున్నది. తమను చంపేస్తామని అమ్మాయి ఫ్యామిలీ బెదిరిస్తున్నట్లు ఆ జంట పిటీషన్లో పేర్కొన్నది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఎవరూ పట్టించుకోవడం లేదని కూడా ఆ జంట తమ పిటీషన్లో ఆరోపించింది. ఆ పిటీషన్‌ను వ్యతిరేకిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేక్ చౌదరీ వాదించారు. అబ్బాయికి 21 ఏళ్లు నిండలేదని, ఇంకా అతనికి పెళ్లి వయసు రాలేదని కోర్టుకు తెలిపారు. సహజీవనం కొనసాగించేందుకు అతనికి పర్మిషన్ ఇవ్వవద్దు అని కోర్టుకు వెల్లడించారురు.
కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కోర్టు కొట్టివేసింది. పెళ్లి వయసు రాలేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, స్వేచ్ఛా హక్కును హరించలేమని కోర్టు పేర్కొన్నది. భారతీయ చట్టాల ప్రకారం లివిన్ రిలేషన్‌ను నిషేధించలేమని, నేరంగా చూడలేమని కోర్టు చెప్పింది. పిటీషన్లో ఉన్న అంశాలను పరిశీలించాలని బిల్వారా, జోద్పూర్ పోలీసుల్ని జస్టిస్ ధండ్ ఆదేశించారు. యువ జంటకు రక్షణ కల్పించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.