న్యూఢిల్లీ: ఇస్రో వరుస విజయాల వెనుక నారీశక్తి ఉన్నది. మొన్న చంద్రయాన్-3 సక్సెస్‌లో ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ కల్పన కీలక పాత్ర పోషించగా, నేడు భానుడిపై పరిశోధనలకు ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 మిషన్ విజయవంతంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగార్ షాజీ ముఖ్య భూమిక పోషించారు. నిగార్ షాజీ (59) జన్మస్థలం తమిళనాడులోని షెంగొట్టాయ్. తిరునల్వేలిలో ఇంజినీరింగ్, రాంచిలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తిచేశారు. అనంతరం ఇస్రోలో చేరారు. ఏండ్లుగా అనేక ప్రాజెక్టుల్లో పాలుపంచుకొన్నారు. ఎనిమిదేండ్ల క్రితం ఆదిత్య-ఎల్1 మిషన్ బాధ్యతలు చేపట్టారు.