Aditya-L1 | శ్రీహరికోట, సెప్టెంబర్ 2: చంద్రయాన్-3 చందమామ రహస్యాలను ఒక్కొక్కటిగా గుట్టువిప్పుతుండగానే, సూర్యుడి అంతుచూసే కార్యక్రమం మొదలైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని శనివారం విజయవంతంగా నింగిలోకి పంపింది. ఇస్రోకు అత్యంత నమ్మకమైన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్వీ) రాకెట్ ద్వారా ఆదిత్య-ఎల్1ను నిర్దేశిత భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం 125 రోజులపాటు సుదీర్ఘ ప్రయాణం చేసి భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో తిష్టవేసి ఆదిత్యుడి రహస్యాలను తెలుసుకొనే ప్రయత్నం చేయనున్నది. ఉపగ్రహంలోని 7 పరికరాలు సూర్యుడికి సంబంధించిన భిన్న అంశాలను అధ్యయనం చేస్తాయి. ఆదిత్య-ఎల్1 రోజుకు 1,440 చిత్రాలను భూమికి పంపనున్నట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఐదేండ్ల పాటు సూర్యుడిపై అధ్యయనం చేయనున్నట్లు పేర్కొన్నాయి.
సుదీర్ఘ ప్రయాణం
ఆదిత్య ఎల్1ను ప్రస్తుతం 235/19,500 కిలోమీటర్ల భూ దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇది 16 రోజులపాటు భూమిచుట్టూ తిరిగి అవసరమైన వేగం పుంజుకొని సూర్యుడివైపు ప్రయాణం మొదలుపెడుతుంది. 1,480.7 కిలోల బరువున్న ఆదిత్య -ఎల్ 1 సౌరశక్తిని వినియోగించుకొని 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అక్కడ లెగ్రాంజియన్ పాయింట్ 1 వద్ద తిష్టవేసి సూర్యుడిపై పరిశోధనలు నిర్వహిస్తుంది. ఈ ప్రయోగంపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆనందం వ్యక్తంచేశారు.
ఏడు పరికరాలతో అధ్యయనం
సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 ఉపగ్రహంలో ఇస్రో 7 అత్యాధునిక పరికరాలను పంపింది.
1. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనోగ్రాఫ్ (వీఈఎల్సీ)
ఇది సూర్యుడి ఉపరితలాన్ని అధ్యయనం చేస్తుంది. తరుచూ సూర్యుడి నుంచి విశ్వంలోకి ఎగిసిపడే కొరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ)పై పరిశోధన చేస్తుంది. ఇది రోజుకు 1,440 ఫొటోలను భూమికి పంపుతుంది.
2. సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (ఎస్యూఐటీ)
ఇది సోలార్ ఫొటోస్పియర్, క్రోమోస్పియర్లపై పరిశోధన చేస్తుంది. సౌర వికిరణం, అతినీల లోహిత కిరణాలపై అధ్యయనం నిర్వహిస్తుంది.
3. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ (ఏఎస్పీఈఎక్స్).
4 ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య (పీఏపీఏ)
ఇవి సౌర గాలులు, శక్తిమంతమైన సౌర అయాన్లను అధ్యయనం చేస్తాయి. సౌర శక్తి విశ్వంలోకి ఎలా పంపిణీ చేయబడుతున్నదనే అంశాన్ని పరిశీలిస్తాయి.
5 సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. (ఎస్ఓ ఎల్ఈఎక్స్ఎస్)
6. హై ఎనర్జీ ఎల్ 1 ఆర్బిటర్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ (హెచ్ఈఎల్1ఓఎస్)
సూర్యుడి నుంచి విశ్వంలోకి వెదజల్లబడే ఎక్స్రే కిరణాలపై ఈ పరికరాలు అధ్యయనం చేస్తాయి.
7. మ్యాగ్నటోమీటర్
ఇది ఎల్ 1 పాయింట్ వద్ద గ్రహాంతర అయస్కాంత క్షేత్రాల లక్షణాలపై పరిశోధన నిర్వహిస్తుంది