కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శుభాంకర్ సర్కార్‌ను ఆ పార్టీ నియమించింది. గతంలో ఈశాన్య రాష్ట్రాలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శిగా ఉన్న ఆయన ప్రస్తుత అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan) స్థానాన్ని భర్తీ చేశారు. సర్కార్ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఆ పార్టీ శనివారం ప్రకటించింది. అలాగే అధిర్ రంజన్ చౌదరి సహకారాన్ని ప్రశంసించింది. బెంగాల్లో పార్టీని పునర్నిర్మించడం తన మొదటి ప్రాధాన్యత అని పార్టీ కొత్త చీఫ్ అన్నారు.
కాగా, బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శుభాంకర్ సర్కార్‌ను పార్టీ నియమించడంపై అధిర్ రంజన్ చౌదరి ఆదివారం స్పందించారు. పార్టీ నిర్ణయంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ‘దీని గురించి నేను ఏమీ చెప్పదలచుకోలేదు. ఎవరైనా అధ్యక్షుడు కావచ్చు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడ్ని ఎన్నుకునే హక్కు పార్టీ హైకమాండ్‌కు ఉంది. పార్టీ అధ్యక్షుడ్ని హైకమాండ్ ఎంపిక చేస్తే సమస్య ఎందుకు వస్తుంది? నాకేమీ అభ్యంతరం లేదు’ అని అన్నారు.
మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి యూసుఫ్ పఠాన్ చేతిలో సొంత స్థానమైన బహరంపూర్‌లో అధిర్ రంజన్ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తనను తప్పించాలని పార్టీ అధిష్టానాన్ని ఆయన కోరారు.