న్యూఢిల్లీ : రాష్ట్రపతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో దిగివచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుక్రవారం లేఖ రాసిన అధిర్ ఆమెను క్షమాపణ కోరారు. మీరు నిర్వహిస్తున్న పదవిని ఉద్దేశించి పొరపాటున సరికాని పదాన్ని వాడినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని రాష్ట్రపతి ముర్ముకు రాసిన లేఖలో అధిర్ రంజన్ పేర్కొన్నారు.
పొరపాటున నోరు జారి ఆ పదాన్ని వాడినందుకు క్షమాపణ కోరుతున్నానని దీన్ని మీరు అంగీకరించాలని కాంగ్రెస్ నేత ఆ లేఖలో కోరారు. అధిర్ అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి రాష్ట్రపత్నిగా వ్యాఖ్యానించిన వీడియో క్లిప్ పెను దుమారం రేపింది. అధిర్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో నిరసన చేపట్టారు. అధిర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణకు కేంద్ర మంత్రులు స్మృతి ఇరాని, నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు.