Pak Shelling | పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో జమ్మూ కశ్మీర్‌కు ఓ ప్రభుత్వ సీనియర్ అధికారి మృతి చెందగా.. ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. రాజౌరి పట్టణంలోని ఓ అధికారి నివాసంపైకి పాక్ సైన్యం ఫైర్ చేసిన షెల్ దూసుకు వచ్చింది. దాంతో రాజౌరీ అదనపు డెప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ థాపా, ఆయన ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. ఇద్దరిని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిద్దని పరిస్థితి సైతం విషమంగానే ఉందని అధికారులు పేర్కొన్నారు. రాజ్‌కుమార్ థాపా మృతికి జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం ప్రకటించారు.
ఇది విషాదకరమైన వార్త అని.. జమ్మూ-కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్‌కు చెందిన అంకితభావంతో పనిచేసే అధికారిని తాము కోల్పోయామన్నారు. శుక్రవారం ఆయన డిప్యూటీ సీఎంతో కలిసి జిల్లాలో పర్యటించారని.. తాను అధ్యక్షతన వహించిన ఆన్లైన్ సమావేశానికి సైతం హాజరయ్యారని తెలిపారు. ఈ రోజు అధికారి నివాసంపై పాక్ కాల్పులు జరిపారని.. రాజౌరి పట్టణాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేశారని.. ఈ ఘటనలో రాజ్‌కుమార్ థాపా చనిపోయారన్నారు. ఈ ఘోర ప్రాణనష్టం తనకు షాక్ లాంటిదని.. ఈ ఘటనపై స్పందించేందుకు తనకు మాటలు రావడం లేదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ‘ఎక్స్’ పోస్ట్‌లో సీఎం అబ్దుల్లా పేర్కొన్నారు.