అహ్మదాబాద్: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ దివ్యాంగ వధువులకు శుభవార్త చెప్పారు. ఆయన చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం దివా షాతో ఈ నెల 7న జరగబోతున్నది. ఈ శుభ సమయంలో జీత్, దివా తీసుకున్న నిర్ణయాన్ని గౌతమ్ అదానీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఏటా 500 మంది దివ్యాంగ సోదరీమణులకు రూ.10 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని కాబోయే దంపతులు నిర్ణయించారని తెలిపారు. ఈ ‘మంగళ్ సేవ’ అత్యంత సంతృప్తి కలిగిస్తున్నదని, ఓ తండ్రిగా తాను గొప్ప అదృష్టవంతుడినని పేర్కొన్నారు. జీత్ దివ్యాంగ సోదరీమణుల నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్న ఫొటోలను షేర్ చేశారు. జీత్, దివా వివాహ మహోత్సవాలు ఈ నెల 7న గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతాయి. సంప్రదాయ పద్ధతిలో, కుటుంబ కార్యక్రమంగా ఈ పెండ్లి జరుగుతుందని గౌతమ్ అదానీ తెలిపారు.