Actor Vijay : కుల (Caste), మత (Religion) అంశాలతో మనసును పాడుచేసుకోవద్దంటూ ప్రముఖ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) అధినేత విజయ్ (Vijay) విద్యార్థులకు సూచించారు. వాటి ఆధారంగా విభజనను తోసిపుచ్చాలన్నారు. 10, 12 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించిన అనంతరం ఆయన పలు సూచనలు చేశారు. ఈ ప్రకృతికి మతం, కులం ఉన్నాయా..? అని ప్రశ్నించారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం అందరికీ సమాన అవకాశాలు ఇచ్చిందని అన్నారు. ప్రజాస్వామిక విలువలను పాటించాలని మీ కుటుంబ సభ్యులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. అవినీతి కార్యకలాపాలకు దూరంగా ఉండే వ్యక్తులకు, విశ్వసనీయత కలిగిన వ్యక్తులకు ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు.
కులం, మతం ఆధారంగా విభజనను తోసిపుచ్చాలని సూచించారు. అలాంటి అంశాలతో మనసు పాడుచేసుకోవద్దని అన్నారు. సూర్యుడు, వరణుడు లాంటి వాటితో నెలవైన ప్రకృతికి ఆ భేదం ఉందా..? అని ప్రశ్నించారు. డ్రగ్స్‌ను దూరం పెట్టినట్టే కులం, మతం లాంటి వాటినీ దరిచేరనీయొద్దని అన్నారు. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడే ఈ ప్రపంచంలో స్వేచ్ఛ ఉంటుందని వ్యాఖ్యానించారు.
కాగా వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. టీవీకేతో సహా ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో విజయ్ అధికార డీఎంకేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీపైనా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.