న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీల గురించి.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అంటే నోరా ఫతేహికి చెప్పలేనంత అసూయ అని శనివారం అతని లాయర్ల ద్వారా ఒక ప్రకటన చేశాడు.
నోరా ఫతేహి ఎప్పుడూ తనను జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు దూరం జరిగేలా బ్రెయిన్ వాష్ చేస్తుండేదని సుఖేశ్ చెప్పాడు. జాక్వెలిన్‌ను వదిలేసి తనతో డేటింగ్ చేయాలని కోరేదని తెలిపాడు. నోరా రోజుకు కనీసం 10 సార్లయినా తనకు ఫోన్ చేసేదని, ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే ఆగకుండా డయల్ చేస్తూనే ఉండేదని అన్నాడు. జాక్వెలిన్, తాను సీరియస్ రిలేషన్లో ఉన్నప్పుడు నోరాను దూరం పెట్టడం మొదలుపెట్టానని చెప్పాడు.
అంతేగాక నోరా ఫతేహి నిత్యం తనకు ఫోన్ చేస్తూ చికాకు తెప్పించేదని, తనకు కావాల్సిన వస్తువులన్నీ తన ద్వారా కొనించుకునేదని సుఖేశ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తనకు మొత్తం రూ.2 కోట్లకుపైగా విలువైన బ్యాగులు, ఆభరణాలను కొనిపెట్టానని వెల్లడించాడు. కాగా, పేరు మోసిన మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ రూ.215 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఈడీ.. దర్యాప్తులో వెల్లడైన వివరాల ఆధారంగా నిక్కీ తంబోలి, చహత్ ఖన్నాలను అరెస్ట్ చేసి ప్రశ్నించారు. ఆ తర్వాత బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. దాంతో ఈడీ వాళ్లకు కూడా నోటీసులు పంపి ప్రశ్నించింది. అయితే, ఈడీ ముందు తన పేరు వెల్లడించిన జాక్వెలిన్‌పై నోరా ఆగ్రహంగా ఉన్నది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉద్దేశపూర్వకంగానే మనీలాండరింగ్ కేసులో తన పేరును ఇరికించిందని మండిపడింది. తప్పుడు ఆరోపణలు చేసిందంటూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్పైన, ఆమె మాటలను ప్రచురించిన మీడియా సంస్థలపై నోరా ఫతేహి రూ.200 కోట్లకు పరువునష్టం దావా వేసింది. ఈ దావాపై ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మార్చి 25న విచారణ జరపనుంది.