Actor Mohanlal : వయనాడ్ (Wayanad) బాధితుల పునరావాసం కోసం ప్రముఖ నటుడు మోహన్‌లాల్ (Mohanlal) రూ.3 కోట్ల విరాళం అందజేశారు. విశ్వశాంతి ఫౌండేషన్ (Viswa Shanti foundation) ద్వారా ఆయన ఈ విరాళం ప్రకటించారు. ‘ప్రస్తుతం తాము విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రూ.3 కోట్లు విరాళంగా ప్రకటించాం. బాధితుల పునరావాసం కోసం ఈ నిధులు అందజేశాం. అసరాన్ని బట్టి మరిన్ని నిధులను కూడా అందజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నాం’ అని మోహన్‌లాల్ చెప్పారు.
కొండచరియలు విరిగిపడి 300కు పైగా జనం మరణించిన వయనాడ్ జిల్లాలోని చూరల్మాల, ముండకై గ్రామాలను ఇవాళ మోహన్‌లాల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విరాళం విషయాన్ని ప్రకటించారు. కాగా, తన తల్లిదండ్రులు విశ్వనాథన్, శాంతకుమారిల పేరిట మోహన్‌లాల్ 2015లో విశ్వశాంతి ఫౌండేషన్‌ను స్థాపించారు. అప్పటి నుంచి ఆ ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
కాగా, మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తు కారణంగా ఇప్పటికే 300 మందికిపైగా మరణించారు. మరో 206 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం మలయాళ నటుడు మోహన్‌లాల్ వయనాడ్‌లో పర్యటించారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న ఆయనకు సైన్యం స్వాగతం పలికింది.
అనంతరం అక్కడ అధికారులతో మోహన్‌లాల్ భేటీ అయ్యారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముండక్కై, చూరల్మాలలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఘటనా ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న వాలంటీర్లు, పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు, ప్రభుత్వ అధికారుల కృషిని మోహన్‌లాల్ ప్రశంసించారు.