న్యూఢిల్లీ : తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ నటి గౌతమి బీజేపీకి రాజీనామా చేశారు. తనను మోసం చేసిన వ్యక్తికి కొందరు సీనియర్ బీజేపీ నాయకులు అండగా నిలిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అలగప్పన్ అనే వ్యక్తి తన ఆస్తిని అక్రమంగా కాజేయడానికి ప్రయత్నిస్తున్నాడని గౌతమి తెలిపారు. కష్టకాలంలో ఉన్న తనకు పార్టీ నాయకులు అండగా ఉండకుండా మోసం చేసిన వ్యక్తికి మద్దతునిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి.. మోసం చేశారని కూడా ఆమె ఆరోపించారు. ఇలాంటి పార్టీలో ఇక కొనసాగలేనని, అందుకే రాజీనామా చేశానని వెల్లడించారు.