ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నడుస్తున్నాయి. ఈ సందర్భంగా నటుడు, గోరఖ్‌పూర్ లోక్‌సభ ఎంపీ, బీజేపీ నేత రవి కిషన్ మాట్లాడుతూ, తాను జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. దేశ జనాభా నియంత్రణకు ఈ బిల్లు ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘జనాభా నియంత్రణ బిల్లు తెచ్చినప్పుడే మనం విశ్వ గురువు కాగలం. జనాభా నియంత్రణ చాలా ముఖ్యం. దేశంలో జనాబా విస్ఫోటనం జరుగుతున్నది. ఈ బిల్లు ఎందుకు తీసుకొస్తున్నానో ప్రతిపక్షాలు అర్థం చేసుకొని మద్దతు ఇవ్వాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, జనాభా నియంత్రణ బిల్లు గురించి బీజేపీ ఎంపీ రవికిషన్ ప్రస్తావించడంపై నెటిజన్లు ఆటాడుకున్నారు. ‘నలుగురు పిల్లల తండ్రివి.. జనాభా నియంత్రణ గురించి మాట్లాడుతున్నావా?’ అంటూ ట్రోల్ చేశారు. ఎంపీ రవికిషన్‌కు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకున్నారు. కూతుళ్లకంటే కొడుకు చిన్నవాడు కావడంపైనా కూడా నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మీరు నలుగురు పిల్లల తండ్రి..మీరు ఈ బిల్లు తీసుకురావడమేంటి?’ అని ఓ నెటిజన్ ఎద్దేవా చేశారు. ‘ఆ బిల్లు పాస్ అయితే.. మీరు నలుగురు పిల్లల్లో ఇద్దరిని మాత్రమే పిల్లలుగా ఎంచుకోవాల్సి ఉంటుంది జాగ్రత్త’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.
ఇదిలా ఉండగా, ఈ బిల్లును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని మంగళవారం రాజ్యసభలో కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఈ సమాచారాన్ని అందించారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.