న్యూఢిల్లీ, మార్చి 8: రష్యాలో ఉద్యోగాల పేరిట కొందరు ఏజెంట్లు భారతీయులను తీసుకువెళ్లి రష్యా ఆర్మీలో సహాయ సిబ్బందిగా చేరుస్తున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించామని, వెంటనే వారిని వదిలిపెట్టాలంటూ మాస్కో దృష్టికి తీసుకు వెళ్లినట్టు పేర్కొన్నది. అధిక జీతాలతో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారతీయులను మోసం చేసి తీసుకెళ్లిన ఏజెంట్లు, వీసా కన్సల్టెంట్లు, ఇతర సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.
సపోర్టింగ్ స్టాఫ్‌గా ఆర్మీలో చేరిన భారతీయులను సాధ్యమైనంత త్వరగా వెనక్కి రప్పించడానికి పూర్తి అంకిత భావంతో కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యా ఆర్మీలో చేరిన హైదరాబాదీ ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. భారతీయులను మోసం చేసిన ఏజెంట్లు, ఇతరులపై సీబీఐ గురువారం దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేసింది.