Gujarat | న్యూఢిల్లీ: బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా గుజరాత్లో నిర్మిస్తున్న ఒక బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణం కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గంలో గుజరాత్లోని ఆనంద్ జిల్లా వాసద్ గ్రామంలో మహీ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద గడ్డర్లతో ఏర్పాటు చేసిన తాత్కాలిక కట్టడం మంగళవారం సాయంత్రం కూలిపోయింది. దీంతో నలుగురు కార్మికులు కాంక్రీట్ దిమ్మెలు, శిథిలాల మధ్య ఇరుక్కుపోయారు. దీంతో క్రేన్లు, ఎస్కవేటర్ల సాయంతో సహాయ చర్యలు చేపట్టారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి దవాఖానలో మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. 508 కి.మీ పొడవు ఉండే ఈ మార్గం గుజరాత్ (352 కి.మీ), మహారాష్ట్ర (156 కి.మీ) మీదుగా సాగుతుంది. బ్రిడ్జి పునాది పటిష్ఠంగా ఉండటం కోసం స్టీల్, కాంక్రీట్ దిమ్మెలతో తాత్కాలిక నిర్మాణం చేపట్టారు.