Operation Lotus | న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఒక రోజు ముందు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ వెళ్లింది. తమ ఎమ్మెల్యే అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సంచలన ఆరోపణలు చేయడంతో దేశ రాజధానిలో హైడ్రామా నడిచింది. ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ అభ్యర్థులలో 16 మందిని తమ పార్టీలోకి మారాలంటూ బీజేపీ ప్రలోభ పెట్టిందని, ఒక్కో అభ్యర్థికి రూ.15 కోట్ల నగదు, మంత్రి పదవి ఇస్తామంటూ బీజేపీ బేరాలు సాగించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. ఆప్ నాయకులు చేసిన ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. బీజేపీపై ఆప్ చేసిన ఆపరేషన్ కమలం ఆరోపణలపై దర్యాప్తు జరపాలని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ను ఆయన ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ శుక్రవారం కేజ్రీవాల్‌కు లీగల్ నోటీసు జారీ చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందు తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆరోపణలకు సంబంధించిన వివరాలు, సాక్ష్యాలు అందచేయాలని కోరింది.
కేజ్రీవాల్‌కు ఆయన నివాసంలో ఏసీబీ నోటీసు అందచేసింది. కాగా, అంతకుముందు, ఆపరేషన్ కమలం ఆరోపణలపై ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన ఏసీబీ అధికారులు లోపలకు ప్రవేశించడానికి అనుమతి లభించలేదు. కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకునే అధికారం ఏసీబీకి లేదని ఆయన తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల ముందు రోజు రాజకీయ డ్రామా సృష్టించేందుకు బీజేపీ పన్నిన కుట్రగా ఈ పరిణామాన్ని ఆయన అభివర్ణించారు. ఢిల్లీ బీజేపీ కార్యదర్శి విష్ణు మిట్టల్ చేసిన ఫిర్యాదుపై ఎల్జీ సక్సేనా ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించారు. ఆప్ నాయకులు కేజ్రీవాల్,సంజయ్ సింగ్ చేసిన ఆపరేషన్ కమలం ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించి వెంటనే దర్యాప్తు జరిపించాలని లెఫ్టినెంట్ గవర్నర్‌కు మిట్టల్ లేఖ రాశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నేతల ఆపరేషన్ కమలంపై ఫిర్యాదు చేసేందుకు తాను ఏసీబీ కార్యాలయానికి వెళుతున్నట్టు తెలిపారు. ఆప్ ఆరోపణలకు ఆధారాలు లేవంటున్న బీజేపీ వాదనను విలేకరులు ప్రస్తావించగా ఆప్ అభ్యర్థులను ప్రలోభ పెట్టిన వ్యక్తి ఫోన్ నంబర్ గురించి తాను వెల్లడించానని, ఇంతకన్నా ఇంకేం ఆధారాలు కావాలని ఆయన ప్రశ్నించారు.
ఎవరి ధీమా వారిదే!
వరుసగా నాలుగో పర్యాయం అధికారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చేపడుతుందా లేక 27 ఏండ్ల విరామం అనంతరం మళ్లీ దేశ రాజధానిలో ప్రభుత్వ పగ్గాలను బీజేపీ చేజిక్కించుకుంటుందా అన్న విషయం మరి కొన్ని గంటల్లో తేలిపోనున్నది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 50 సీట్లు గెలవడం ఖాయమని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ శుక్రవారం విశ్వాసం ప్రకటించారు. అయితే మళ్లీ గెలుపు తమదేనని, తమ పార్టీయే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆప్ నాయకులు నమ్మకంగా ఉన్నారు. మరోవైపు ఈసారి ఢిల్లీలో తాము పాగా వేస్తామని కమలనాథులు విశ్వాసం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. మొదటి కొన్ని గంటల్లోనే ఫలితాల సరళి వెల్లడయ్యే అవకాశం ఉంది. ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొనడం, ఎమ్మెల్యే అభ్యర్థుల కొనుగోలు ఆరోపణలు రావడం తదితర కారణాల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లడం నిషేధించామని తెలిపారు.