Ind vs Pak : భారత దేశం (India) లోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు పొంచి ఉందంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు (Pakistan President) ఆసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Jardari) చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు జర్దారీకి లేదని స్పష్టంచేసింది. ఆయన వ్యాఖ్యలు అసంబద్ధమైనవని, అనవసరమైనవని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Ranadheer Jaiswal) కొట్టిపారేశారు.
వారణాసిలోని కాశీ రైల్వే స్టేషన్ సమీపంలోగల గంజ్ షహీదా మసీదుకు భారత రైల్వే శాఖ జారీచేసిన నోటీసులను ఉద్దేశించి జర్దారీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గురువారం రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. పాక్ అధ్యక్షుడి ప్రకటనను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోందని, భారత అంతర్గత విషయాలపై మాట్లాడే అర్హత ఆయనకు ఏమాత్రం లేదని తేల్చిచెప్పారు. పాకిస్థాన్లో మైనారిటీల హక్కుల ఉల్లంఘన, అక్కడి మానవ హక్కుల దయనీయ స్థితిపై అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను జైస్వాల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఇతరులకు హితవు పలికే ముందు పాక్ తన దేశంలోని పరిస్థితులను చక్కదిద్దుకోవాలని సూచించారు. ద్వేషం, మతతత్వాన్ని ప్రోత్సహించడమే పాకిస్థాన్ జాతీయ విధానంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు. భారత్ తన అంతర్గత విధానాలకు సంబంధించిన అంశాల్లో, ముఖ్యంగా జమ్మూకశ్మీర్ వంటి విషయాల్లో విదేశాల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని చాలాకాలంగా హెచ్చరిస్తోంది.