High Court | భోపాల్: భర్త సమ్మతి లేకుండా భార్య గర్భాన్ని తొలగించుకోవడం క్రూరత్వం కిందకు వస్తుందని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. క్రూరత్వం, భర్తను విడిచిపెట్టి వెళ్లడం కారణాలతో పిటిషనర్ (భార్య), ప్రతివాది (భర్త)కి విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును తాము సమర్థిస్తున్నట్టు చెప్పింది. క్రూరత్వం శారీరక, మానసిక హానిని కలిగిస్తుందని, భర్త అనుమతి లేకుండా గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకోవడం ఈ నిర్వచనం పరిధిలోకి వస్తుందని తెలిపింది.
భూమి చుట్టూ విద్యుత్తు క్షేత్రం: నాసా
న్యూఢిల్లీ: భూమి చుట్టూ సూక్ష్మమైన విద్యుత్తు క్షేత్రం ఉన్నట్లు నాసా పరిశోధకులు గుర్తించారు. ఇది దాదాపు కనిపించదని చెప్పారు. గురుత్వాకర్షణ శక్తికి ఎంత ప్రాముఖ్యం ఉందో దీనికి కూడా అంతే ప్రాధాన్యం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు మనకు గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత క్షేత్రాల గురించి మాత్రమే తెలుసు. తాజాగా మూడో క్షేత్రం గురించి కూడా మనకు అవగాహన కలుగుతున్నది. భూ ధృవాల నుంచి నిరంతరం ప్రవహించే సూపర్సానిక్ సూక్ష్మ కణాల గాలులు అంతుబట్టని రీతిలో ఉంటాయి. ఈ గాలులకు కారణం ఈ యాంబీపోలార్ విద్యుత్తు క్షేత్రమే అయి ఉండవచ్చునని పరిశోధకులు చెప్తున్నారు. కంటికి కనిపించని ఈ విద్యుత్తు క్షేత్రాన్ని గుర్తించడం వల్ల భూమిపైన మాత్రమే జీవరాశి ఎందుకు రూపొందిందో చెప్పవచ్చునని అంటున్నారు.
భారతీయుల్లో ఐరన్, కాల్షియం లోపం
న్యూఢిల్లీ : భారతీయుల ఆహారంలో ఆరోగ్యానికి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు తగిన స్థాయిలో ఉండటం లేదని తాజా అధ్యయనం అంచనా వేసింది. స్త్రీ, పురుషుల్లో అన్ని వయసుల వారికీ ఈ సమస్య ఉందని తెలిపింది. ఆహారంలో ఐరన్, కాల్షియం, ఫోలేట్ వంటి పోషకాలు తగిన మోతాదులో ఉండటం లేదని వివరించింది. ఈ అధ్యయనం ‘ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్’ జర్నల్లో ప్రచురితమైంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం సహా ఇతర సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 185 దేశాల్లో ఆహారం ద్వారా 15 మైక్రోన్యూట్రియెంట్స్ వినియోగంపై అంచనాలను వెలుగులోకి తీసుకొచ్చిన తొలి అధ్యయనం ఇదే. ప్రపంచ జనాభాలో 70 శాతం మంది (దాదాపు 500 కోట్ల మంది) తగినంత అయోడిన్, విటమిన్ ఈ, కాల్షియంలను తీసుకోవడం లేదు.