ప్రయాగ్‌రాజ్: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్‌కు రకరకాల సాధువులు హాజరవుతున్నారు. పవిత్ర స్నానాలు చేసేందుకు దేశవ్యాప్తంగా కూడా భక్తులు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటున్నారు. ఆధునిక జీవితాన్ని దూరం పెట్టి.. ఆధ్యాత్మిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న కొందరు టెకీ బాబాలు కూడా మహాకుంభ్‌కు వచ్చారు. ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుకున్న అభయ్ సింగ్ ఇప్పుడు బాబాగా అవతరించారు. ఆయన్ను ఐఐటీ బాబాగా(IIT Baba) పిలుస్తున్నారు. కుంభమేళాకు వస్తున్న భక్తులు… ఆ బాబా పట్ల ఆకర్షితులవుతున్నారు.
ఐఐటీ బాబా అభయ్ సింగ్‌ది హర్యానా రాష్ట్రం. శాస్త్ర, సాంకేతిక జీవితాన్ని వదిలేసి ఆయన.. ఆధ్మాత్మిక లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈయన్ను ఇంజినీర్ బాబా అని కూడా పిలుస్తారు. ఐఐటీ బాబా జీవిత జర్నీ ఓ విశేషమైంది. ఫోటోగ్రాఫీ, ఆర్ట్స్ పట్ల ఫోకస్ పెట్టడానికి ముందు బాంబేలో నాలుగేళ్ల పాటు ఉన్నాడు ఆ బాబా. క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఓ జాబ్ కూడా సంపాదించాడు. కార్పొరేట్ కంపెనీలో కొన్నేళ్లు పనిచేశాడు. ఆ జాబ్‌ను తొందరగా వదిలేశాడు.
ట్రావెల్ ఫోటోగ్రఫీని అతిగా ఇష్టపడే ఐఐటీ బాబా.. ఇంజినీరింగ్ లైఫ్ స్టయిల్‌కు బ్రేకప్ చెప్పేశాడు. ట్రావెల్ ఫోటోగ్రఫీలో ప్రొఫెషనల్ కోర్సును పూర్తి చేసి ఆ తర్వాత తన జీవిత గమనాన్ని మార్చుకున్నాడు. జీవితం పట్ల ఉన్న తత్వ బోధన మారిందన్నాడు. కొన్ని రోజుల ఆయన విద్యార్థులకు ఫిజిక్స్ సబ్జెక్టులో కోచింగ్ ఇచ్చాడు. అకాడమీలో సక్సెస్ సాధించినా.. జీవితంలో అతనికి సంతృప్తి దొరకలేదు. దీంతో అతను ఆధ్యాత్మికత వైపు మళ్లాడు. ఆధ్యాత్మిక నిజాలను అర్థం చేసుకునేందుకు మరింత లోతుగా తన జీవితాన్ని అంకితం చేశాడు.
శివుడిని ఆరాధించే ఐఐటీ బాబా.. ఇప్పుడు ఆధ్యాత్మికతను ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పాడు. సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను అర్థం చేసుకుంటున్నట్లు తెలిపాడు. లోతుగా వెళ్లిన కొద్దీ.. సర్వం శివమయం అని తెలుస్తోందన్నాడు. శివుడే వాస్తవమని, శిశుడు అద్భుతమన్నాడు. ఇంగ్లీష్ భాషలో మంచి పట్టు ఉన్న ఐఐటీ బాబా.. మహాకుంభ్‌కు వస్తున్న భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. శాస్త్రీయ విజ్ఞానం, ఆధ్యాత్మికతను కలిపి అతను భక్తులను పలకరిస్తున్నాడు.
అభయ్ సింగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 29 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. మెడిటేషన్, యోగా, ప్రాచీన సూత్రాలు, ఆధ్యాత్మిక విధానాల గురించి ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటాడు. మహాకుంభ్ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందని, మనస్సుకు శాంతిని ఇచ్చిందన్నాడు.