Justice AS Oka | న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో సంస్కరణలు అవసరమని జస్టిస్ ఏఎస్ ఓకా అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఆయనకు వీడ్కోలు పలికే కార్యక్రమం జరిగింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో జస్టిస్ ఓకా మాట్లాడుతూ, భారత ప్రధాన న్యాయమూర్తి కేంద్రంగా సుప్రీంకోర్టు పని చేస్తున్నదని, దీనిలో మార్పులు అవసరమని చెప్పారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ కాలంలో ఈ మార్పులు రావచ్చునని తెలిపారు.
ఈ నెల 13న సీజేఐగా పదవీ విరమణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా తమను పారదర్శక మార్గంలో నడిపించారన్నారు. సర్వోన్నత న్యాయస్థానంలోని ప్రతి జడ్జిని విశ్వాసంలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకునేవారని చెప్పారు. జస్టిస్ గవాయ్ రక్తంలో ప్రజాస్వామిక విలువలు ఉన్నాయన్నారు. “ట్రయల్ కోర్టులు, సామాన్యుల గురించి కూడా మనం ఆలోచించాలి. ట్రయల్, జిల్లా కోర్టుల్లో అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. ట్రయల్ కోర్టును ఎన్నడూ సబార్డినేట్ కోర్ట్ అని పిలవొద్దు. అలా పిలవడం రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం” అని చెప్పారు.