Masood Azhar | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ ఉగ్రవాది, భారత్‌లో జరిగిన కీలక ఉగ్రదాడుల్లో పాత్రధారి అబ్దుల్ రవూఫ్ అజర్ హతమయ్యాడు. పదుల సంఖ్యలో అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న రాక్షసుడు బహావల్పూర్లో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో తీవ్రంగా గాయపడి మరణించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. బుధవారం బహావల్పూర్లోని జైషే కేంద్ర కార్యాలయంపై జరిపిన దాడిలో రవూఫ్ తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స పొందుతూ రాత్రి మరణించారని పేర్కొన్నాయి. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌కు రవూఫ్ సోదరుడు.
1999లో భారత్‌కు చెందిన ఐసీ – 814 విమానాన్ని హైజాక్ చేసిన ఘటన వెనుక మొత్తం సూత్రధారి రవూఫే. అంతేకాదు.. అతడి సోదరుడు మసూద్ అజర్ భారత్‌లో 2001లో కశ్మీర్ అసెంబ్లీ, పార్లమెంట్‌పై జరిపిన ఉగ్రదాడి, 26/11 ముంబై దాడులు, 2016లో పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై జరిపిన దాడిలో, పుల్వామా దాడిలో రవూఫ్ కీలక పాత్ర పోషించాడని చెప్తున్నారు. అతడు పాకిస్థాన్ ప్రభుత్వానికి, ఐఎస్ఐకి మధ్య వారధిగా పనిచేస్తున్నాడని చెప్తున్నారు.
భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌లో హై అలర్ట్ ఇంకా కొనసాగుతున్నది. గురువారం ప్రధాన మంత్రి షెహబాజ్ ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఆర్మీ తీసుకునే చర్యలకు ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. గురువారం తెల్లవారుజామున భారత్ మరోసారి తమపై దాడి చేసిందని పాక్ ప్రకటించింది. ఇజ్రాయెల్ తయారు చేసిన 25 ఆత్మాహుతి డ్రోన్లను భారత్ ప్రయోగించిందని, వాటిని తాము కూల్చేశామని ప్రకటించింది. మరోవైపు పంజాబ్ తదితర సరిహద్దు రాష్ర్టాల్లో స్కూళ్లకు సెలవులను 11వ తేదీ వరకు పొడిగించింది. అన్ని శాఖల అధికారుల సెలవులను రద్దు చేసింది. కరాచీ ఎయిర్‌పోర్ట్‌ను మూసి వేసింది.