న్యూఢిల్లీ : ఢిల్లీలోని మదన్‌పూర్ ఖదర్‌లో ఆక్రమణల తొలగింపునకు బుల్డోజర్లను తెప్పించడంతో ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ అక్కడికి చేరుకున్నారు. షహీన్ బాగ్‌లో కూల్చివేతలను అడ్డుకున్నందుకు అమనతుల్లా ఖాన్‌పై కేసు నమోదైంది.
బీజేపీ పాలక మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) చేపట్టిన కూల్చివేతలను తాము అడ్డుకుంటామని, కార్పొరేషన్ చర్యలను నిరసిస్తూ జైలుకు వెళ్లేందుకు తాము సిద్ధమని ఆప్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పేద ప్రజల ఇండ్లను కాపాడేందుకు ఎంతవరకైనా వెళతామని హెచ్చరించారు. మదన్‌పూర్ ఖదర్‌లో ఎలాంటి ఆక్రమణలు లేవని ఆక్రమణలను తొలగిస్తే తాను కార్పొరేషన్‌కు మద్దతిస్తానని ఆయన సవాల్ విసిరారు.
మదన్‌పూర్ ఖదర్‌లో కూల్చివేత ప్రక్రియకు స్ధానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వీధుల్లోకి చేరిన ప్రజలు ఆక్రమణల తొలగింపునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు షహీన్‌బాగ్‌లో ఆక్రమణల తొలగింపును అడ్డుకున్నారని ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ ఆయన అనుచరులపై దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసులు నమోదయ్యాయి.