INDIA Alliance | న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించగా.. బీహార్‌లోని అధికార జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌కుమార్ బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కూటమిలోని మరో భాగస్వామి అయిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్‌లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది.
శనివారం ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ పంజాబ్‌లోని 13 సీట్లు, చండీగఢ్‌లోని ఒక స్థానం కలిపి మొత్తం 14 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి కూడా అధికార ఎన్డీయేతో పొత్తు కాదనలేనని చెప్పారు. తన తాతకు భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఎన్డీయేలో చేరడానికి సుముఖతను వ్యక్తం చేశారు. అయితే తాము ఇప్పటికీ ఇండియా కూటమితోనే ఉన్నామని ఆప్ తెలిపింది. తమందరి ఉమ్మడి లక్ష్యం బీజేపీని ఓడించడమని చెప్పింది.