Swati Maliwal | న్యూఢిల్లీ, మే 13: లోక్‌సభ ఎన్నికల వేళ ఆమ్ఆద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుకున్నది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి జరిగిందని, కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బందిలో ఒకరు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారని సోమవారం మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి, కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్టు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఎంపీ స్వాతి మలివాల్ ఫిర్యాదు చేశారని ఢిల్లీ పోలీస్ వర్గాలు తెలిపాయి. రాతపూర్వకంగా తర్వాత ఫిర్యాదు చేస్తానని చెప్పి.. ఆమె వెళ్లిపోయినట్టు డీసీపీ (నార్త్) ఎంకే మీనా చెప్పారు. అయితే, దాడి ఘటనపై స్వాతి మలివాల్ మీడియా ముఖంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ డిమాండ్ చేశారు. సీఎం కేజ్రీవాల్ సూచన మేరకు, ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ సోమవారం ఆమెపై దాడి చేసినట్టు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దాడి ఘటనపై దర్యాప్తు చేసేందుకు విచారణ బృందాన్ని పంపనున్నట్టు జాతీయ మహిళా కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా పంజాబ్‌లో ప్రచారం చేసే స్టార్ కాంపెయినర్ల జాబితాను ఆప్ సోమవారం విడుదల చేసింది. ఈ జాబితాలో మలివాల్ పేరు కనిపించలేదు. ఇటీవల ఆప్ ప్రకటించిన ఢిల్లీ స్టార్ కాంపెయినర్ల జాబితాలో స్వాతి ఉన్నారు.