న్యూఢిల్లీ: పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఢిల్లీ మేయర్ ఎన్నిక బుధవారం ఎట్టకేలకు జరిగింది. అనుకున్నట్టుగానే ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆప్ చేజిక్కించుకొన్నది. స్థానిక సివిక్ సెంటర్లో జరిగిన ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. మొత్తం 266 ఓట్లు పోలవగా.. ఒబెరాయ్‌కు 150 ఓట్లు, రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. దీంతో ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక అయినట్టు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) అధికారులు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా జరిగింది. డిప్యూటీ మేయర్‌గా ఆప్ అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ బీజేపీ అభ్యర్థి కమల్ బగ్రీపై 31 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్బాల్‌కు 147 ఓట్లు రాగా, బగ్రీకి 116 ఓట్లు వచ్చాయి. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఢిల్లీ మేయర్ ఎన్నిక ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నామినేటెడ్ సభ్యులు మేయర్ ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం లేదని తేల్చిచెప్పడంతో తాజాగా ఎన్నిక జరిగింది.
ప్రజాభిమానం గెలిచింది..
మేయర్ ఎన్నికల్లో విజయంపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. గెలుపొందిన అభ్యర్థులకు అభినందనలు తెలిపిన ఆయన.. ఇది ఢిల్లీ ప్రజల విజయమని, గూండాయిజం ఓడిపోయిందని ట్వీట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ఇదేవిధంగా స్పందించారు. ‘గూండాలు ఓడిపోయారు, ప్రజలు గెలిచారు. ఢిల్లీ మేయర్‌గా ఆప్ అభ్యర్థి ఎన్నికైన నేపథ్యంలో ఆప్ కార్యకర్తలకు, ఢిల్లీ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు’ అని ట్వీట్ చేశారు. కాగా, ఢిల్లీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం షెల్లీ ఒబెరాయ్ హౌస్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.
బీజేపీ కుట్రలకు చెక్!
ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదాల పర్వంలో నడిచిన విషయం తెలిసిందే. ప్రజాతీర్పును గౌరవిస్తామని చెబుతూనే మెజారిటీ లేకున్నా అనైతికంగా మేయర్ పీఠాన్ని దక్కించుకొనేందుకు బీజేపీ చేసిన కుట్రలే ఇందుకు కారణమని ఆప్ విమర్శించింది. గత ఏడాది డిసెంబర్ 4న జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో 250 స్థానాలకుగానూ ఆప్ 134 సీట్లు గెలుచుకొని మేయర్ పీఠం దక్కించుకొనేందుకు అర్హత సాధించింది. 15 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 104 సీట్లుతోనే సరిపెట్టుకొన్నది. అయితే నియమాలకు విరుద్ధంగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం, మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవటం ఢిల్లీ మేయర్ ఎన్నికపై వివాదానికి కారణమైంది.