న్యూఢిల్లీ : జీ20 డిన్నర్ కోసం రాష్ట్రపతి భవన్ ప్రతినిధులకు పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (Bharat) అని ఉండటం పట్ల ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మంగళవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా పేర్లు మార్చేందుకు మన జాతీయ గుర్తింపు బీజేపీ సొంత ఆస్తి కాదని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ ఇండియా పేరును ఎలా తొలగిస్తుంది? ఈ దేశం ఓ రాజకీయ పార్టీ సొత్తు కాదని, ఈ దేశం 135 కోట్ల భారతీయులదని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. ఇక విపక్షాలు ఇండియా కూటమితో ముందుకు రావడంతోనే జీ20 డిన్నర్‌కు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (Bharat) పేరుతో ఆహ్వాన పత్రం పంపారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి బీజేపీని అధికారం నుంచి సాగనంపుతుందని పేర్కొన్నారు. ఇండియా అనే ఒక్కపదంతోనే బీజేపీ ఉలిక్కిపడుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీయేతర శక్తులన్నీ ఫాసిస్ట్ బీజేపీ సర్కార్‌ను మట్టికరిపించేందుకు ఇండియా పేరుతో ఏకం కాగానే కాషాయ పార్టీ ఇండియా పేరును భారత్‌గా మార్చాలని కోరుకుంటోందని స్టాలిన్ ఆరోపించారు.
భారత్ రూపురేఖలు మార్చేస్తామని ప్రగల్బాలు పలికిన బీజేపీ తొమ్మిదేండ్ల తర్వాత దేశం పేరు మార్చేస్తోందని దుయ్యబట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా బీజేపీని మట్టికరిపిస్తుందని అన్నారు. కాగా ఇండియా పేరు మార్పు వ్యవహరంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. మోదీ సర్కార్ చరిత్రను తిరగరాస్తోందని ఆరోపిస్తూ ఇప్పటికిప్పుడు ఇండియా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె నిలదీశారు.
విపక్ష కూటమి తమ పేరును ఇండియా నుంచి భారత్‌గా మారిస్తే అప్పుడు మోదీ సర్కార్ దేశం పేరును భారతీయ జనతా పార్టీగా మార్చేస్తారా అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానపత్రాలు వెళ్లిన దాఖలాలను తామెన్నడూ చూడలేదని జీ20 డిన్నర్ ఆహ్వానపత్రాలను ప్రస్తావిస్తూ డీఎంకే ఎంపీ కనిమొళి విస్మయం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని రాస్తుంటారని ఈసారి ఎందుకు ఇలా జరిగింది..? దీనివెనుక ఉద్దేశం ఏంటి? దదీని వెనుక ఉన్న రాజకీయాలేంటని ఆమె నిలదీశారు.
Read More :