ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేసిన ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలపై ఆమ్ఆద్మీ స్పందించింది. ఆప్ నేత రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ఈ విషయం ఆయనకు ముందే తెలిస్తే.. 2017 ఎన్నికల్లో ఎందుకు బయటపెట్టలేదని చద్దా సూటిగా ప్రశ్నించారు. కేజ్రీవాల్‌పై దుష్ప్రచారం చేయడానికి, ఓ పద్ధతి ప్రకారం ఇలా ప్రచారాలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పంజాబ్ ప్రజలను మోసపుచ్చేందుకే కుమార్ విశ్వాస్ ఈ ఆరోపణలు చేశారన్నారు. ప్రజల్లో లేనిపోని గందరగోళాన్ని సృష్టించడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, పంజాబీలు ఆమ్ఆద్మీతోనే వున్నారని రాఘవ్ చద్దా ధీమా వ్యక్తం చేశారు.
కుమార్ విశ్వాస్ ఏమన్నారంటే…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏదో ఒక రోజు పంజాబ్ ముఖ్యమంత్రి అయినా, లేదంటే ఖలిస్తాన్ ప్రధాని అయినా అవుతానని సీఎం కేజ్రీవాల్ తనతో అన్నారని కుమార్ విశ్వాస్ వెల్లడించారు. పంజాబ్ అంటే సీఎం కేజ్రీవాల్‌కు ఏమాత్రం అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. పంజాబ్ అంటే రాష్ట్రం కాదని, అదో భావన అని ఆయన పేర్కొన్నారు.
నేను మొదటి నుంచి చెబుతూనే వస్తున్నా. వేర్పాటువాదులు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతిచ్చే వారితో కలవొద్దని నేను చెప్పాను. కాదు.. కాదు.. నేను కలుస్తానని అన్నారు. ఏమీ ఆలోచించాల్సిన పనిలేదన్నారు. అయితే వేర్పాటువాదులతో చేతులు కలపొద్దని నేను అన్నాను. ఏమవుతుంది? నేనే మొట్ట మొదటి ప్రధాని అవుతా. అని కేజ్రీవాల్ అన్నారు. అలాగే పంజాబ్ సీఎం కావడానికి కూడా ఆయన ప్రణాళికలు వేసుకున్నారు. ఇప్పటికీ ఆ ఊహల్లోనే వుంటారు అని కుమార్ విశ్వాస్ వెల్లడించారు. అధికారం కోసం కేజ్రీవాల్ ఏమైనా చేయగలరని కుమార్ విశ్వాస్ విమర్శించారు.