న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఢిల్లీలో ఆప్ వర్సెస్ ఈడీ అనేలా పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. తాజాగా మద్యం పాలసీ కేసుపై దర్యాప్తునకు సంబంధించి ఈడీపై ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిశీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ చేస్తున్న మొత్తం దర్యాప్తును ఒక ‘స్కామ్’గా వర్ణించారు. నిందితులు, సాక్షుల సీసీటీవీ విచారణ, వాంగ్మూలాలకు సంబంధించిన ఆడియో రికార్డింగ్‌లను దర్యాప్తు సంస్థ తొలగించిందని ఆరోపించారు. ఆడియో ఫైల్స్‌ను తొలగించడం ద్వారా ఈడీ ఎవరికి కాపాడాలనుకొంటున్నదని, ఏం దాచాలనుకొంటున్నదని ప్రశ్నించారు.
ఆతిశీపై ఈడీ చట్టపరమైన చర్యలు!
అయితే ఆప్ నేత అతిశీ ఆరోపణలను ఈడీ వర్గాలు కొట్టిపారేశాయి. అతిశీ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకొనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించాయి. విచారణ సమయంలో ఫుటేజ్ కేవలం వీడియో ఫార్మాట్లో మాత్రమే రికార్డు అవుతుందని, ఆ సమయంలో సీసీటీవీ వ్యవస్థలో ఆడియో రికార్డింగ్ వ్యవస్థ ఉండదని పేర్కొన్నాయి.