Haryana Assembly Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై ఆప్, కాంగ్రెస్‌ల మధ్య స్పష్టత రాలేదు. పొత్తుపై ఆప్ కీలక ప్రకటన చేస్తూ సోమవారం సాయంత్రంలోగా కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాకుంటే మొత్తం 90 స్ధానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. కాంగ్రెస్‌తో పొత్తుకు సంబంధించి పార్టీ నాయకత్వం నుంచి తమకు ఇప్పటివరకూ ఎలాంటి సందేశం లేదని హరియాణ ఆప్ చీఫ్ సుశీల్ గుప్తా వెల్లడించారు. సోమవారం సాయంత్రానికి మొత్తం 90 అసెంబ్లీ స్ధానాల అభ్యర్ధులను ప్రకటించేందుకు ఆప్ హరియాణ శాఖ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
90 స్ధానాలకు అభ్యర్ధుల ప్రకటనపై కసరత్తు సాగుతున్నదని, కాంగ్రెస్‌తో పొత్తుకు సంబంధించి ఆప్ హైకమాండ్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి సంకేతాలూ లేవని చెప్పారు. మరోవైపు హరియాణలో పోటీకి ఆప్ సంసిద్ధంగా ఉందని పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులపై కసరత్తు కొలిక్కివచ్చిందని, పార్టీ కేంద్ర నాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన అనంతరం అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తామని చెప్పారు. ఆప్ సన్నాహాలతో కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో చర్చల్లో ఎలాంటి పురోగతి లేదనే సంకేతాలు వెల్లడవుతున్నాయి.
మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు దిశగా చర్చలు ఫలవంతమవుతాయని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు పార్టీలకు ప్రయోజనం కలిగించేలా పొత్తు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అక్టోబర్ 5న జరిగే హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించాయని చెబుతున్నా కార్యాచరణలో అది సాధ్యమయ్యేలా లేదని అంటున్నారు. కొన్ని సీట్లపై ఆప్ పట్టుబడుతుండటంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని చెబుతున్నారు. 20 స్ధానాలు కావాలని ఆప్ డిమాండ్ చేస్తుండగా సింగిల్ డిజిట్ స్ధానాలనే కాంగ్రెస్ ఆఫర్ చేస్తుండటంతో చర్చలు ఓ కొలిక్కిరావడం లేదని తెలిసింది.
Read More :
Rahul Gandhi | బీజేపీ అంటే భయం పోయింది.. ప్రజాస్వామ్యంపై దాడిని ప్రజలు అంగీకరించరు : రాహుల్