న్యూఢిల్లీ: బీజేపీ నేతలు తనను కిడ్నాప్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన కౌన్సిలర్ (AAP Councillor) రామచంద్ర ఆరోపించారు. సీబీఐ, ఈడీ పేరుతో తనను బెదిరించినట్లు తెలిపారు. అయితే అరవింద్ కేజ్రీవాల్‌కు నిజమైన సైనికుడినని ఆయన అన్నారు. గత ఆదివారం ఢిల్లీలోని ఆప్‌కు చెందిన కొందరు కౌన్సిలర్లతోపాటు రామచంద్ర ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అయితే నాలుగు రోజుల తర్వాత రామచంద్ర వెనుకడుగు వేశారు. ఆదివారం కొన్ని గంటలపాటు కనిపించకుండా పోయిన ఆయన ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చారు. బీజేపీ నేతలు తనను బలవంతంగా కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ‘ఆదివారం ఉదయం ఐదారు మంది వ్యక్తులు మా ఇంటికి వచ్చారు. నన్ను కారులో బీజేపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ సీబీఐ, ఈడీ పేరుతో నన్ను బెదిరించారు. మా పార్టీ నేతలు పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేయడంతో నన్ను విడిచిపెట్టారు’ అని అన్నారు. అయితే సీబీఐ, ఈడీలకు తాను భయపడబోనని తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్‌కు నిజమైన సైనికుడినని చెప్పారు.
కాగా, ఆప్ కౌన్సిలర్ రామచంద్ర ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఈ వ్యవహారంతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ ప్రవీణ్ శంకర్ కపూర్ తెలిపారు. ‘నకిలీ సంచలనాలకు మీరు (ఆప్) రారాజులు. కౌన్సిలర్ రామచంద్ర మీ పార్టీలో లేరు. దానితో మాకు సంబంధం లేదు. కానీ ఆయన తన ఇంట్లో ఉన్నారు. మీరు పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు’ అని ఎక్స్‌లో విమర్శించారు.