రాష్ట్రం నుంచి అవినీతిని పారద్రోలాలంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆమ్ఆద్మీకి పట్టం కట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హిమాచల్ ప్రజలకు పిలుపునిచ్చారు. తమకు రాజకీయాలు చేయడం చేతకాదని, కేవలం పనిచేయడం, అవినీతిని పారద్రోలడం మాత్రమే తెలుసన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి సీఎం కేజ్రీవాల్ హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్‌షోలో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో అత్యంత నిజాయితీ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.
మంచి మంచి పాఠశాలల నిర్మాణం, ఆస్పత్రుల నిర్మాణం, నిరంతరాయ విద్యుత్, నీటి సరఫరా లాంటివి మాత్రమే తెలుసన్నారు. తాము ఢిల్లీలో అధికారంలోకి వచ్చి పాలనను సరి చేశామని, నీతిమంతమైన పాలనను అందిస్తున్నామని, ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం కూడా నీతిమంతమైన పాలన జాబితాలో చేరిందని చెప్పుకొచ్చారు. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వాళ్లు భారతీయులను బానిసలుగా ఉంచారని, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ తమ విధానాల వల్ల ప్రజలను బానిసలుగా మార్చేస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు.